సంగారెడ్డి , జిన్నారం: కాలుష్య జలాలు తాగి రైతుకు సంబంధించిన మూగజీవాలు మృతి చెందిన సంఘటనలో బాధితుడికి ఎమ్మెల్యే జిఎంఆర్ అండగా నిలిచారు. పరిశ్రమల యాజమాన్యాలతో చర్చించి నష్టపరిహారం అందించారు. వివరాల్లోకి వెళ్తే..
జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామ పరిధిలోని కిష్టాయపల్లి గ్రామానికి చెందిన బాశెట్టి సాయికుమార్ అనే రైతుకు సంబంధించిన 18 మూగజీవాలు ఇటీవల గ్రామ పరిధిలోని కుంటలో కాలుష్య జలాలు తాగి మృతి చెందాయి. ఈ అంశంపై స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక పరిశ్రమల యాజమాన్యాలతో చర్చించి, బాధితుడికి నష్టపరిహారం అందించాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా స్థానిక మోడరన్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 16 లక్షల రూపాయల నష్టపరిహారం అందించేందుకు అంగీకరించారు. శుక్రవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో రైతు సాయికుమార్ కి పదహారు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ… కాలుష్యకారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని పిసిబి ఉన్నత అధికారులకు ఇటీవల సూచించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డపోతారం మాజీ సర్పంచ్ ప్రకాష్ చారి, పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి మూర్తి, స్థానికులు పాల్గొన్నారు.