గుంటూరు : కూటమి ప్రభుత్వ పెద్దలు మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతోందంటున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గుంటూరు నగరంపాలెం పీఎస్ లో దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు. జనసేన నాయకుడు అడపా మాణిక్యాలరావు ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.
అటు, ఇదే అంశంపై విజయనగరంలోనూ దువ్వాడపై ఫిర్యాదు చేశారు. పవన్ ను కించపరిచేలా దువ్వాడ మాట్లాడారంటూ కొప్పుల వెలమ వెల్ఫేర్, డెవలప్ మెంట్ కార్పొరేషన్ రవికుమార్ విజయనగరం డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ, మచిలీపట్నం దువ్వాడపై కేసులు నమోదైనట్టు తెలుస్తోంది.
కోనసీమ జిల్లాలో జనసేన మహిళా కౌన్సిలర్లు అమలాపురం డీఎస్పీని కలిసి దువ్వాడపై ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబును ప్రశ్నించకుండా ఉండేందుకు పవన్ కల్యాణ్ నెలకు రూ.50 కోట్లు తీసుకుంటున్నాడంటూ దువ్వాడ చేసిన వ్యాఖ్యలతో జనసేన శ్రేణులు భగ్గుమంటున్నాయి.