హైదరాబాద్ : ఈరోజు మీడియా సమావేశం లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 33పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్మీడియేట్ సహా అంతకుముందు నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ ‘లోకల్’ అని కొత్త జీవోలో పేర్కొన్నారని తెలిపారు. కానీ ఏడేళ్లలో కనీసం నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికత వర్తిస్తుందని పాత జీవో చెబుతోందన్నారు.
ఈ ప్రభుత్వం ఏడేళ్లలో కనీసం నాలుగేళ్లు అనే దానిని తొలగించి… 9, 10వ తరగతులు, ఇంటర్ ఎక్కడ చదివితే అక్కడ అని చెబుతోందన్నారు. మన ఉద్యోగాలు మనకే దక్కాలనేది తమ నినాదమని, అందుకే 95 శాతం ఉద్యోగాలు మనకు దక్కాలనే ఉద్దేశంతో జీవో 114ను తీసుకువచ్చామన్నారు. మనకు ఉద్యోగాలు దక్కాయని… ఇప్పుడు విద్యావకాశాలు కూడా మనకు దక్కాలన్నారు.
ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు, ఫార్మసీ, అగ్రికల్చర్ బీఎస్సీ, పీజీ కోర్సులు… ఇలా విద్యలోనూ స్థానికతను నిర్ధారించేందుకు గత ప్రభుత్వం నియమ నిబంధనలను రూపొందించిందన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ అడ్మిషన్స్ కోసం జీవో 33ను కొత్తగా తీసుకువచ్చిందన్నారు. ఇది అసమగ్రమైన జీవో అని విమర్శించారు. ప్రస్తుత జీవో ప్రకారం మన తెలంగాణ బిడ్డనే మనకు నాన్ లోకల్ అయ్యే పరిస్థితి ఉంటుందన్నారు.