చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం అక్టోబరు 5న దసరా కానుకవగా రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో, ఈ సినిమా టైటిల్ సాంగ్ ను చిత్రబృందం నేడు విడుదల చేసింది. ఈ పాటకు తమన్ బాణీలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘తార్ మార్ తక్కర్ మార్’, ‘నజభజ జజర’ పాటలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు టైటిల్ సాంగ్ కూడా రావడంతో సోషల్ మీడియాలో మెగా అభిమానుల సందడి అంతాఇంతా కాదు.
‘గాడ్ ఫాదర్’ చిత్రానికి మోహన్ రాజా దర్శకుడు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలకపాత్ర పోషిస్తుండడంతో అటు ఉత్తరాదిలోనూ గాడ్ ఫాదర్ పై హైప్ నెలకొంది.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై రామ్ చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సత్యదేవ్ ప్రతినాయక పాత్ర పోషించగా, నయనతార కీలక పాత్రలో కనిపించనుంది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.