మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడినట్లుగా తనకు సంబంధించినదిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై తాజాగా బుధవారం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. ఈ వీడియో ఒరిజినల్ కాదని… అసలు ఈ వీడియో ఒరిజినలా?, నకిలీదా? అన్నది తేల్చడం కష్టంగా మారిందని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప ప్రకటించిన మరుక్షణమే ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనదిగా ప్రచారం అవుతున్న వీడియో ఫేక్ వీడియో అని తాను ముందే చెప్పానని మాధవ్ అన్నారు. అది వంద శాతం ఫేక్ వీడియో అని చెప్పానని ఎంపీ వ్యాఖ్యానించారు. ఈ వీడియోను తాను పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు. వీడియో వచ్చాక కూడా తన పనులు తాను చేసుకున్నానని ఆయన వెల్లడించారు.
వీడియోపై న్యాయ పరంగా చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు. వీడియోను సృష్టించిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన తెలిపారు. తనపైనే ఈ వీడియో ఎందుకు సృష్టించారన్న విషయాన్ని వీడియోను అప్‌లోడ్ చేసిన వారినే అడగాలంటూ ఆయన చెప్పారు. ఈ వ్యవహారంలో తాను కడిగిన ముత్యంలా బయటపడతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఈ వీడియోను సృష్టించారని ఎంపీ ఆరోపించారు.