చాలా వంటకాల్లో మనం ఎర్ర కారంపొడిని వాడుతుంటాం. కొన్నింటిలో పూర్తిగా పచ్చి మిర్చిని వాడుతాం. ఇప్పుడు ఆకుపచ్చ కారంపొడి కూడా మనకు అందుబాటులోకి రానుంది. దీన్ని యూపీలోని వారణాసిలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసర్చ్ (ఐఐవీఆర్) తయారు చేసింది. అంతేకాదు ఆకుపచ్చ కారంపొడికి పేటెంట్ హక్కులను కూడా పొందింది.
పచ్చకారంపొడిని ఒక ప్రత్యేకపద్ధతిలో తయారు చేస్తున్నారు. తొలుత పచ్చి మిరపకాయలను రంగు పోకుండా ఒక ప్రత్యేక పద్ధతిలో ఎండబెడతారు. ఆ తర్వాత పొడి చేస్తారు. ఇది మరింత ఘాటుగా, కారంగా ఉంటుందని చెపుతున్నారు. అంతేకాదు కారంలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ఇందులో శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ, క్లోరోఫిల్, క్యాప్సిన్ ఉంటాయి. పచ్చ కారంపొడిని సాధారణ ఉష్ణోగ్రత వద్ద చాలా నెలల పాటు నిల్వ ఉంచవచ్చని ఐఐవీఆర్ తెలిపింది. ఎర్ర కారంపొడితో పోలిస్తే పచ్చ కారంపొడితో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని చెప్పింది.