కోల్‌కతా : ఓ విద్యార్థిని కోసం పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో గ్రీన్ కారిడార్ ఏర్పాటైంది. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌లో పదోతరగతి (మాధ్యమిక) బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. ఓ విద్యార్థిని పరీక్షకు హాజరయ్యేందుకు హౌరాలో ఎదురుచూస్తూ ఉంది. పరీక్షకు ఆలస్యమవతుందన్న కంగారుతో ఆమె బిక్కమొహంతో ఏడుస్తుండగా.. హౌరాబ్రిడ్జి ట్రాఫిక్ గార్డ్ ఇన్సెపెక్టర్ సౌవిక్ చక్రవర్తి రాజాకత్రా సమీపంలోని పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నావని ఆ విద్యార్థినిని ప్రశ్నించగా.. తాను 10వ తరగతి పరీక్షలు రాస్తున్నానని, శాయంబజార్‌లోని ఆదర్శ్ శిక్ష నికేతన్ పరీక్షా కేంద్రానికి వెళ్లడానికి సాయం చేయాలని కోరింది. మీ ఇంట్లో వారు తోడు రాలేదా అని అధికారి ప్రశ్నించగా.. తన తాత మరణించడంతో కుటుంబ సభ్యులందరూ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్లినట్లు తెలిపింది. దీంతో స్పందించిన ఇన్‌స్పెక్టర్ వెంటనే ఆ విద్యార్థినిని తన అధికారిక వాహనంలో ఎక్కించుకున్నాడు.
పరీక్షా కేంద్రం వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాల్సిందిగా ట్రాఫిక్ కంట్రోల్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 11.30 సమయానికల్లా విద్యార్థినిని పరీక్ష కేంద్రం వద్ద విడిచిపెట్టారు. దీంతో విద్యార్థిని చక్కగా పరీక్ష రాసేసింది. తన కుమార్తె కూడా 11వ తరగతి చదువుతోందని.. అందుకే ఓ విద్యార్థిని పడే బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నానని ఇన్సెపెక్టర్ సౌవిక్ చక్రవర్తి పేర్కొన్నారు. ఆ విద్యార్థిని చూసినపుడు సమయం 11.20 అయ్యిందని.. తక్షణమే స్పందించి 11.30కల్లా ఆ విద్యార్థినిని పరీక్షా కేంద్రానికి చేర్చానని అన్నారు. ఆమెను అధికార వాహనంలో కాకుండా మరో వాహనంలో పంపించవచ్చు. కానీ, పది నిమిషాల్లో చేరుకోవడం కష్టమని.. అందుకే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలని ఆదేశించానని అన్నారు. తాము బయలుదేరి వెళ్తున్న సమయంలోనూ ఆ విద్యార్థిని చాలా ఆందోళన చెందుతోందని.. ధైర్యంగా ఉండమని భరోసా ఇచ్చానని అన్నారు.