- ఉద్యోగ భద్రత కల్పించాలి
- కన్సాలిడేటెడ్ పే ఇవ్వాలి
- ఆటో రెన్యువల్ చేయాలి
బెల్లంపల్లి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించి తమను ఆదుకోవాలని బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గెస్ట్ లెక్చరర్లు బుధవారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు విన్నవించుకున్నారు. బెల్లంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ మేరకు ఎమ్మెల్యేను గెస్ట్ లెక్చరర్లు కలిశారు. మా కుటుంబాలకూ భరోసా ఇవ్వండి తాము బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 9 మందిమి పనిచేస్తున్నామని తెలిపారు. తమకు ఏడాదిలో 7.. 8 నెలల పాటు మాత్రమే జీతాలు వస్తున్నాయని, అది కూడా నెలకు ఇంత అని కాకుండా అరకొరగా వస్తున్నాయని వివరించారు. దీనికి కారణం కన్సాలిడేటెడ్ పే అనేది లేకపోవడమేనని వివరించారు. కాబట్టి డిగ్రీ గెస్ట్ లెక్చరర్లకు కన్సాలిడేటెడ్ పే ఇచ్చేలా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా కోరారు. అలాగే ఏటా కొత్త నియామకాలు కాకుండా గతం నుంచి పనిచేస్తున్న వారిని ఆటో రెన్యువల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ భద్రత కల్పించడం ద్వారా తమ కుటుంబాలకు కూడా ఆర్థిక భరోసా ఇవ్వాలని ముక్తకంఠంతో కోరారు. గెస్ట్ లెక్చరర్ల వినతి పత్రం అందుకున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వినతి పత్రం అందజేసిన వారిలో బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గెస్ట్ లెక్చరర్ల సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ కంబాల మురళీకృష్ణ, జనరల్ సెక్రటరీ పైడాకుల రవి, వైస్ ప్రెసిడెంట్ కాంపల్లి రామరాజు, ట్రెజరర్ అల్లం తిరుపతి, సంయుక్త కార్యదర్శి పి అరుణ, సభ్యులు కే సమ్మక్క పాల్గొన్నారు.