- సీటీ స్కాన్ యంత్రానికి సుస్తీ!
- ఉన్న ఒక్కటీ పనిచేయట్లేదు!
- రోగులకు తప్పని ఆర్థిక భారం
- జీజీహెచ్‌లో దుస్థితి
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ఉన్న ఏకైక సీటీ స్కాన్ యంత్రం మొరాయించింది. శనివారం రాత్రి నుంచే అది పని చేయడం లేదు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు సీటీ స్కాన్ పరీక్షలు అవసరమైతే ఏంటి పరిస్థితి? వారిని ఎక్కడకు పంపాలో తెలియక ఆస్పత్రి వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి.
రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారికి, కడుపు నొప్పి సమస్యలు, గర్భిణులకు అత్యధికంగా సీటీ స్కాన్ పరీక్షలు చేయాల్సి వస్తుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా రహదారి ప్రమాదాలు ఉమ్మడి గుంటూరులో చోటుచేసుకుంటున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా నలుమూలల నుంచి రోడ్డు ప్రమాదాల కేసులు, కడుపు నొప్పుల కేసులు జీజీహెచ్‌కు వస్తాయి.
గతంలో ఇది ఎప్పుడు మొరాయించినా ప్రత్యామ్నాయంగా నాట్కో కేన్సర్ కేంద్రంలో ఉన్న సీటీ యంత్రంపై పరీక్షలు చేయించుకోవాలని పంపేవారు. దానిలో కచ్చితత్వం రావడం లేదని కేవలం కేన్సర్ రోగులకు ఉద్దేశించి మాత్రమే చేసే సీటీ స్కాన్ యంత్రం కావడంతో అక్కడకు పంపడానికి వైద్యులు ఇష్టపడడం లేదు. మరోవైపు ఆ యంత్రం వద్దకు సాధారణ రోగులు వెళ్లి పరీక్షలు చేయించుకోవడానికి జంకుతున్నారు.
కేన్సర్ రోగులు ఉండే ప్రదేశంలో తమకు పరీక్షలు చేయిస్తారా అంటూ అక్కడకు వెళ్లేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. సాధారణ రోగులు ఇక్కడ చేయించుకోవడం వల్ల ఇది కూడా ఏ క్షణాన అయినా మొరాయించే అవకాశం ఉందని టెక్నీషియన్లు చెబుతున్నారు. మొత్తంగా ఆ యంత్రం పునరుద్ధరణకు నోచుకునేదెప్పుడనేది ప్రశ్నార్థకమవుతోంది. అప్పటివరకు రోగి జేబుకు చిల్లు పడక తప్పని పరిస్థితి నెలకొంది.
స్థాయికి మించి పరీక్షలు
ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు వెళ్లి చేయించుకునే ఆర్థిక స్థోమత లేనివారి పరిస్థితి ఏమిటో తెలియకుండా ఉంది.
మరోవైపు వైద్యులకు కూడా అత్యవసరమైతేనే సీటీ పరీక్షలకు రాయాలని సూచన చేయాలని భావిస్తున్నారు.
రెండేళ్ల నుంచి అదనంగా మరో కొత్త మిషన్ తీసుకొచ్చి అందుబాటులో ఉంచాలని వైద్యులు మొత్తుకుంటున్నా కనీసం ప్రతిపాదనలు పంపలేదు.
ప్రస్తుతం ఉన్న యంత్రం 2014లో ట్రామాకేర్ ఆస్పత్రి కింద జీజీహెచ్‌కు మంజూరైంది.
ఆనాటి నుంచి దానిపై రోజుకు సగటున 100 నుంచి 130 దాకా పరీక్షలు చేస్తున్నారు.
సహజంగా రోజుకు 60-70కు మించి చేయకూడదని, అంతకుమించి చేస్తే ఆ యంత్రం త్వరగా పాడైపోతుందని టెక్నీషియన్లు చెబుతున్నారు.
పదేళ్ల వరకు అసలు రిపేర్లు రావు. అలాంటిది జీజీహెచ్‌లోని యంత్రంపై బాగా ఒత్తిడి పడడంతో అది ఎప్పుడూ మొరాయిస్తూనే ఉంటోంది.
శనివారం రాత్రి నుంచే అది డౌన్ అవుతోందని గుర్తించి వెంటనే ఆస్పత్రి వర్గాలు కాల్ లాగ్ చేసి కంపెనీకి తెలియపరిచారు.
అయితే కంపెనీ నుంచి ఆదివారం వరకు ఎలాంటి స్పందన లేదని తెలిసింది.
పేరుకు పోయిన బకాయిలు
ఈ యంత్రం నిర్వహణకు జీజీహెచ్ ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఆ కంపెనీ ఏటా వచ్చి వార్షిక మెయింటనెన్స్ చేస్తున్నా నిర్వహణ వ్యయాలు మాత్రం చెల్లించడం లేదు.
ఇప్పటికే రెండేళ్ల నుంచి చెల్లింపులు నిలిచాయి.
ఏడాదికి రూ.35లక్షలు చెల్లించేలా ఒప్పందంలో పేర్కొన్నారు.
వార్షిక మెయింటెనెన్స్ వ్యవధిలో యంత్రానికి ఏ స్పేర్‌పార్ట్స్ పోయినా నిర్వహణ ఏజెన్సీయే భరిస్తుంది.
గతేడాది పిక్చర్ ట్యూబ్ పోయింది. రూ.25లక్షలకు పైగా వెచ్చించి దాన్ని ఏజెన్సీ తీసుకొచ్చి వేయడంతో తిరిగి యంత్రం పనిచేయడం ప్రారంభించింది.
కనీసం నిర్వహణ ఛార్జీలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించడంతో సదరు ఏజెన్సీ జీజీహెచ్ తీరుపై గుర్రుగా ఉంది. రెండేళ్ల నుంచి చిల్లిగవ్వ ఇవ్వలేదు.
రూ.70లక్షల వరకు చెల్లింపులు పేరుకుపోయాయి. ఈ మొత్తం చెల్లిస్తేనే సీటీ యంత్రాన్ని ముట్టుకుంటామని గుత్తేదారు చెప్పినట్లు తెలిసింది.
బకాయిలే ఇవ్వకపోతే దానికి మరమ్మతులు చేసి పునరుద్ధరించటం తమ వల్ల కాదని కంపెనీ చేతులెత్తేసోంది.
అంత మొత్తంలో చెల్లించడానికి ఆసుపత్రి వద్ద బడ్జెట్ లేదని, డీఎంఈ వద్ద ఉండే బడ్జెట్ నుంచి అధిగమించడం తప్పమరో ప్రత్యామ్నాయం లేదంటున్నారు.
ఎక్సరేలకూ దిక్కులేదు…
ఎముకలు-కీళ్లు, న్యూరో సర్జరీ, న్యూరాలజీ విభాగాల్లో రోగులకు చాలా వరకు ఎక్సరేలు తీస్తారు.
వాటిని నేరుగా థియేటర్ నుంచి వార్డు, ఓపీ విభాగాలతో పాటు శస్త్రచికిత్స థియేటర్లలో ఉండి వైద్యులు మానిటర్లలో చూసుకునేలా అత్యాధునికమైన ప్యాక్స్ విధానం ఉంది. ఇది పాడైపోయింది.
ఆపై దీని నిర్వహణకు కంపెనీకి రూ.1.5లక్షలు బకాయిలు పేరుకుపోవడంతో సదరు కంపెనీ ఆ యంత్రాన్ని పునరుద్ధరించడం లేదు.
ఇంత పెద్ద ఆసుపత్రిలో దాని పునరుద్ధరణకు అవసరమయ్యే నిధులు కూడా లేవా అంటూ వైద్యులే పెదవి విరుస్తున్నారు.
ప్రస్తుతం తాము ఏదైనా ఎక్సరే చూడాలంటే తమ వద్ద ఉండే పీజీలను ఎక్సరే థియేటర్‌కు పంపి దాన్ని చరవాణితో ఫొటో తీసుకుని చూడాల్సి వస్తోందని, ఈ క్రమంలో స్పష్టత లోపిస్తోందని చెబుతున్నారు.
శస్త్రచికిత్స మందిరాల్లో రోగులకు శస్త్రచికిత్స చేసేటప్పుడు ఆ పార్టు ఎలా ఉందో మానిటర్‌లో చూసుకుంటూ శస్త్రచికిత్స చేసేవారు.
ప్రస్తుతం సెల్‌ఫోన్‌లో దాని ఫొటో చూసి చేయాల్సి రావడం చాలా ఇబ్బందికరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రజని గుంటూరు వాసి అయినా జీజీహెచ్‌లో సమస్యలు మాత్రం అపరిష్కృతంగానే ఉంటున్నాయి.
పేద రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.