- రేగులగడ్డ అటవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్
- మైనింగ్ పర్మిషన్లు ఎలా వచ్చాయి ?
- ఖనిజ సంపద పై అధికార పార్టీ కన్ను
- కెజిఎఫ్,పుష్ప సినిమాలను తలపించే మైనింగ్ మాఫియా
- మైనింగ్ మాఫియాని బట్టబయలు చేసిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని
పల్నాడు జిల్లా గురజాల : కే జి ఎఫ్, పుష్ప సినిమాలను తలపించేలా పల్నాడు అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. మాచవరం మండలం రేగులగడ్డ గ్రామం అటవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని సోమవారం మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పరిశీలించారు. పులిచింతల బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత బ్యాక్ వాటర్ వలన గ్రామాల ప్రజలందరికీ నష్టపదిహారం చెల్లించి, గ్రామాలు ఖాళీ చేయడం జరిగిందని యరపతినేని పేర్కొన్నారు. వారందరికీ పునరావాసం కల్పించడం జరిగిందన్నారు. అయితే అక్కడే ఉన్న ఖనిజ సంపదపై అధికార పార్టీ నాయకులు కన్ను పడిందని, అందుకు అనువుగా ఉన్న గురజాల నియోజకవర్గం లో మాచవరం మండలంలోని రేగులగడ్డ ముంపు గ్రామాన్ని పార్టీ నాయకులు ఎంచుకున్నారన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే అటవీ సంపద వందల ఎకరాల్లో ముగ్గురాయి నిక్షేపాలు అపారంగా ఉన్నాయని, అటవీ అధికారుల సహాయంతో మైనింగ్ అధికారుల ప్రమేయంతో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, భీమా మహిళలైన కాసు ప్రతాపరెడ్డి, అల్లు పిచ్చి రెడ్డి, నెల్లూరి రామస్వామి తదితరులు ఇక్కడ అక్రమ క్వారింగ్ మొదలు పెట్టారని యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. ఇక్కడ అక్రమ మైనింగ్ జరిగే ప్రాంతానికి చేరుకోవాలంటే సాధారణ వ్యక్తులకు ప్రవేశం ఉండదని నాటు పడవలో సుమారు 30 నిమిషాల ప్రయాణం చేసి రేగులగడ్డ అటవీ ప్రాంతంలోనే అక్రమ క్వారీ ప్రాంతానికి కూలీలను ఉదయం చేరుస్తారని, సాయంత్రం తిరిగి అదే నాటు పడవలో వారిని ఇళ్లకు పంపుతారు అన్నారు. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు సినిమాలలో చూస్తుంటామే కానీ రియల్ గా ఇప్పటివరకు చూడలేదు అన్నారు. గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి అక్రమ మైనింగ్ పుణ్యమా అనే పల్నాడు ప్రాంతంలో కూడా ఇలాంటి సన్నివేశాలు చూడగలుగుతున్నామన్నారు. అక్కడ పని చేసే భారీ యంత్రాలను మాచవరం మండలం చెన్నాయపాలెం అటువైపు ప్రాంతం నుండి సుమారు 5 నుండి 6 గంటల ప్రయాణంతో తరలిస్తున్నారు. సాధారణ ప్రజలకు అక్కడ ఏమి జరుగుతుందో తెలిసే అవకాశమే లేదన్నారు. ఎందుకంటే రేవుల గడ్డ ప్రాంతంలో ఉన్న కొన్ని అనుమతులు ఉన్న క్వారీ పేర్లు చెప్పి అటవీ ప్రాంతంలో ఈ అక్రమ క్వారీ నీ తన అనుచరులతో మొదలుపెట్టించిన ఘనత ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి చెల్లిందన్నారు. అటవీ, మైనింగ్ ,రెవిన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. అదే సాధారణ ప్రజలు అడవిలో నుండి ఒక్క ట్రక్కు మట్టి తెచ్చుకోవాలన్న కనీసం వంట చెరుకు తెచ్చుకోవాలన్నా సవాలక్ష ప్రశ్నలు వేసి ఇబ్బందులకు గురి చేసే అధికారులు ఇప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రశ్నించారు. అధికార పార్టీ నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ పై టిడిపి పార్టీ పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు.