అభ్యర్థుల ఎంపిక కసరత్తులో తెలుగుదేశం పార్టీ వేగం పెంచింది. ఖరారైన అభ్యర్థులకు ఆంతరంగికంగా సంకేతాలు పంపి పనిచేసుకోవాలని సూచిస్తోంది. పల్నాడు జిల్లా గురజాలలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును తిరిగి నిలపాలని నిశ్చయించారు. ఒక దశలో ఆయన్ను నరసరావుపేట అసెంబ్లీ స్థానానికి పంపబోతున్నారని
నరసరావుపేట బరిలో అరవిందబాబు
ఆలూరు నుంచి వీరభద్రగౌడ్
చిత్తూరు లోక్‌సభకు దగ్గుమళ్ల
టీడీపీ నాయకత్వం ఖరారు!
అభ్యర్థుల ఎంపిక కసరత్తులో తెలుగుదేశం పార్టీ వేగం పెంచింది. ఖరారైన అభ్యర్థులకు ఆంతరంగికంగా సంకేతాలు పంపి పనిచేసుకోవాలని సూచిస్తోంది. పల్నాడు జిల్లా గురజాలలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును తిరిగి నిలపాలని నిశ్చయించారు. ఒక దశలో ఆయన్ను నరసరావుపేట అసెంబ్లీ స్థానానికి పంపబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ, గురజాలలో ఆయనపై అసంతృప్తితో ఉన్న కొందరు నేతలతో చంద్రబాబు మాట్లాడి సర్దుబాటు చేశారు. నియోజకవర్గంలో పని చేసుకోవాలని యరపతినేనికి సూచించినట్లు సమాచారం. నరసరావుపేటలో ప్రస్తుత ఇన్‌చార్జి డాక్టర్ అరవింద బాబువైపే టీడీపీ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కర్నూలు జిల్లా ఆలూరు అభ్యర్థిగా స్థానిక నేత వీరభద్ర గౌడ్ ఖరారైనట్లు సమాచారం. ఇంతకు ముందు ఈ సీటుకు కోట్ల సుజాత ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆమె భర్త కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి ఈసారి డోన్ టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకోవడంతో ఆమె ఆలూరు నుంచి పక్కకు జరిగారు. చిత్తూరు లోక్‌సభ అభ్యర్థిగా దగ్గుమళ్ల ప్రసాదరావు ఖరారైనట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఆయన ఆదాయపు పన్ను శాఖలో ఉన్నత స్థానంలో పనిచేసి రిటైరయ్యారు. గుంటూరు జిల్లావాసి అయిన ఆయన బాపట్ల లోక్‌సభ సీటును ఆశిస్తూ వచ్చారు. ఆ సీటును ఎస్సీల్లో మాదిగ ఉప కులానికి ఇవ్వాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. ఈ నేపఽథ్యంలో దగ్గుమళ్లను చిత్తూరు పంపాలని నిర్ణయించారు. ఆయన కూడా అందుకు అంగీకరించారు. బాపట్ల లోక్‌సభ అభ్యర్థిపై ఇంకా నిర్ణయం జరగలేదు.
నేతలకు అచ్చెన్నాయుడు బుజ్జగింపులు
పొత్తులో జనసేనకు ఇచ్చిన నియోజకవర్గాలకు చెందిన కొందరు టీడీపీ నేతలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గురువారం ఇక్కడకు పిలిపించి మాట్లాడారు. తాడేపల్లిగూడేనికి చెందిన వలవల మల్లికార్జునరావు (బాబ్జీ), తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్, అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తదితరులు వీరిలో ఉన్నారు. ‘ఒక పార్టీతో పొత్తు కుదుర్చుకున్నప్పుడు కొన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. అనేక సమీకరణల ఆధారంగా సీట్ల ఎంపిక జరుగుతుంది. దీనికి మీరు సహకరించాలి. రాజకీయంగా మీ ప్రయోజనాలకు ఇబ్బంది లేకుండా పార్టీ చూసుకుంటుంది. గెలిపించి తీసుకొస్తే పార్టీ నాయకత్వం వద్ద మీ విలువ పెరుగుతుంది. అర్థం చేసుకుని సహకరించండి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. వారు కూడా అంగీకారం తెలిపారని టీడీపీ వర్గాలు తెలిపాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి కూడా అచ్చెన్నాయుడిని కలిశారు. అక్కడ ఆయన రాఘవేందర్ నుంచి పోటీ ఎదుర్కొంటున్నారు. తనకే అవకాశం కల్పించాలని తిక్కారెడ్డి కోరినట్లు సమాచారం.