తిరుమల: తిరుమలలో మే 14 నుండి 18వ తేదీ వరకు ఐదు రోజుల పాటు హనుమత్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులతోను, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఈవో మాటల్లోనే….
తిరుమలలో వేసవిలో రద్దీ ప్రారంభమైదని, రోజుకు శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300/-, ఎస్ ఎస్ డి, దివ్య దర్శనం టోకెన్లు కలిపి 55 వేలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సర్వదర్శనంలో రోజుకు 10 నుండి 15 వేల మందికి మాత్రమే దర్శనం కల్పించేందుకు అవకాశం ఉంటుంది. కావున దర్శనానికి వచ్చే భక్తులు ఓపికతో ఉండి, టీటీడీకి సహకరిస్తూ స్వామివారి దర్శనం చేసుకోవాలన్నారు.
- హనుమత్ జయంతి ఉత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా తిరుమలలోని అంజనాద్రి, ఆకాశగంగ, నాదనీరాజనం వేదికలపై అన్నమాచార్య, దాససాహిత్య, హిందూ ధర్మప్రచార పరిషత్ కళాకారులతో ఆధ్యాత్మిక, భక్తిసంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం.
- ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో మే 14న తుని తపోవనం శ్రీ సచ్చిదానంద స్వామి, మే 15న కుర్తాలం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతిస్వామి, మే 16న కంచి పీఠాధిపతి శ్రీ
విజయేంద్రసరస్వతి స్వామి, మే 17న శ్రీ అహోబిల మఠాధిపతి శ్రీ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి, మే 18న పుష్పగిరి మఠం పీఠాధిపతి శ్రీ విద్యాశంకరభారతీతీర్థ స్వామీజీలు అనుగ్రహ భాషణం చేస్తారు. - సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం మే 16న ఉదయం 5.50 నుండి రాత్రి 10.30 గంటల వరకు దాదాపు 18 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగుతుంది. సుందరకాండలోని మొత్తం 2,872 శ్లోకాలను వేద పండితులు పారాయణం చేస్తారు.
- మహేంద్రగిరి పర్వతం నుండి లంకకు వెళ్లి సీతమ్మను కలసి తిరిగి మహేంద్ర గిరిని ఆంజనేయస్వామివారు చేరుకోవడానికి 18 గంటల సమయం పట్టింది, కావున తిరుమల వేదవిజ్ఞాన పీఠంలో ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు దాదాపు 18 గంటల పాటు 67 మంది ప్రముఖ పండితులతో అఖండ పారాయణ యజ్ఞాన్ని నిర్వహిస్తాం.
- ఈ మొత్తం కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తాం.
- విజయానికి ప్రతీక అయిన సుందరకాండ పారాయణంలో ప్రజలందరూ తమ ఇళ్ల వద్ద నుండే పాల్గొనాలని కోరుతున్నాను.
- అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని టీటీడీ పండితమండలి పౌరాణిక, చారిత్రక, భౌగోళిక ఆధారాలతో ధ్రువీకరించింది. ఇందుకు సంబంధించిన వివరాలను వివిధ భాషల్లో టీటీడీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచాం.
- ఈ విషయం పైన ఎవరికైనా సందేహాలు, అనుమానాలు ఉంటే టీటీడీ పండితమండలిని సంప్రదించవచ్చు.
- 2021 జులై 25వ తేదీన ప్రారంభమైన బాలకాండ పారాయణం మే 15న ముగుస్తుంది. మే 17వ తేదీ నుండి అయోధ్యకాండ పారాయణం ప్రారంభం అవుతుంది.
- తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం కాంప్లెక్స్, ప్రధాన కళ్యాణ కట్ట కాంప్లెక్స్, ఏటీసీ సర్కిల్‌లో పాదరక్షలు భద్రపరుచు కేంద్రాలను ప్రారంభించాం. త్వరలో పిఎసి`1, 2, 3, నారాయణగిరి క్యూలైన్లు, రాంభగీచా, సుపథం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ప్రారంభిస్తాం. ఈ కౌంటర్లలో భక్తులకు చక్కగా సేవలందిస్తున్న శ్రీవారి సేవకులను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.
- తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడిచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నాం. ఇక్కడ టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి మార్గంలో గాలిగోపురం వద్ద తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాలి. లేనిపక్షంలో స్లాటెడ్ దర్శనానికి అనుమతించబడరు.
- శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇవ్వడం జరుగుతున్నది.
- అదేవిధంగా, భక్తులకు తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం, రైల్వే స్టేషన్ వెనుకవైపు గోవిందరాజస్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్‌స్లాట్ (ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తున్నాం. భక్తులు ఈ విషయాలను గమనించాల్సిందిగా కోరడమైనది.
- శ్రీవారి భక్తులు టిటిడి పేరిట ఉన్న నకిలీ వెబ్‌సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశంతో టిటిడి ఐటి విభాగం క్షుణ్ణంగా పరిశీలించి 52 నకిలీ వెబ్‌సైట్లను, 13 నకిలీ మొబైల్ యాప్‌లను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
- పలువురు భక్తులు నకిలీ వెబ్‌సైట్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకుని తిరుమలకు వచ్చి ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి నకిలీ వెబ్‌సైట్ల గురించి తెలిస్తే కాల్‌సెంటర్‌కు 155257 అనే నంబరుకు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
- టిటిడి అధికారిక వెబ్‌సైట్ లో మాత్రమే ఆర్జితసేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలని భక్తులను కోరడమైనది.
– తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం విచ్చేస్తున్న భక్తులందరికీ దర్శనం, ఇతర సేవలు అందిస్తున్న టిటిడి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్య, వైద్యరంగాల్లో ఇతోధిక సేవలు అందిస్తోంది.
- ఇటీవల విడుదలైన ఇంటర్మీడియేట్, పదో తరగతి పరీక్ష ఫలితాల్లో టిటిడి కళాశాలలు, ఉన్నత పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధించాయి. ప్రత్యేక తరగతుల నిర్వహణ, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. ఇందుకు కృషి చేసిన జెఈవో, డిఈవో, ప్రిన్సిపాళ్లు, హెడ్మాస్టర్లు ఇతర బోధనా సిబ్బందిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.
- తిరుమలలోని ఎస్వీ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను రేమాండ్స్ సంస్థకు చెందిన సింఘానియా ట్రస్టు దత్తత తీసుకుంది. ఈ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను మరింత మెరుగుపరిచి అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా ట్రస్టు చర్యలు తీసుకుంటోంది. ఇదే స్ఫూర్తితో టిటిడిలోని మరిన్ని పాఠశాలలను దత్తత తీసుకోవడానికి సింఘానియా ట్రస్టు ముందుకు రావడం సంతోషకరమైన విషయం.
- ఏజెన్సీ ప్రాంతమైన పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 29 నుంచి మే 4వ తేదీ వరకు మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభించాం.
- ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 17 నుంచి 22వ తేదీ వరకు మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభిస్తాం.
- జమ్మూలోని మజీన్ గ్రామంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ జూన్ 8న నిర్వహిస్తాం. త్వరలో అహ్మదాబాద్, రాయ్‌పూర్‌లలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నాం.
- ముంబయిలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ సిడ్కోకు సమర్పించడం జరిగింది. త్వరలో భూమిపూజ నిర్వహించి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభిస్తాం.
- తిరుపతిలోని కపిలతీర్థంలో ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 14న ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య మిథున లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆ తర్వాత భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
ఏప్రిల్ నెలలో నమోదైన వివరాలు :
దర్శనం :
– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ` 20.95 లక్షలు.
హుండీ :
– హుండీ కానుకలు ` రూ.114.12 కోట్లు.
లడ్డూలు :
– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య ` 1.01 కోట్లు.
అన్నప్రసాదం :
– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య ` 42.64 లక్షలు.
కల్యాణకట్ట :
– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ` 9.03 లక్షలు.
ఈ కార్యక్రమంలో జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిశోర్, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్‌విబిసి సిఈవో షణ్ముఖ్‌కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.