- అటు పోలీసులు.. ఇటు కౌన్సిలర్..
- జోగిపేటలో ఘటన
సంగారెడ్డి : పోలీసుల వేధింపులు భరించలేక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట నిత్యం ఆత్మహత్యలు… ఆత్మహత్య ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో సోమవారం ఓ యువకుడు పోలీసుల వేధింపులు భరించలేక సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సెల్ టవర్ ఎక్కిన కుమ్మరి రామచందర్ ను కిందికి దింపే ప్రయత్నం చేశారు. చివరకు కుటుంబ సభ్యులు, స్థానికుల, పోలీసులు చొరవతో కిందికి దిగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సెల్ టవర్ ఎక్కడానికి గల కారణాలను బాధితుడు రామచందర్ వివరిస్తూ తనను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించాడు . నర్సాపూర్, సంగారెడ్డి తో పాటు జోగిపేట పోలీస్ స్టేషన్లో వివిధ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులలో ఒకే రోజు కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేయడంతో ఒక్కరోజే మూడు కోర్టులకు ఎలా వస్తానని అందుకు హాజరు తేదీలను మార్చాలని పోలీసులను వేడుకొన్న వినిపించుకోలేదని బాధితుడు బోరున విలపించాడు. పీసుల ఖాదర్ కాకపోవడంతో తనకు వారెంట్లు జారీ అయి ప్రతిసారి జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుందని అందుకే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది అన్నారు. మరోవైపు జోగిపేట మున్సిపల్ పరిధిలో తనకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా పట్టణంలోని రెండో వార్డు మున్సిపల్ కౌన్సిలర్ భాగ్యలక్ష్మి భర్త లక్ష్మణ్ తనకు 50 వేలు ఇస్తే కానీ డబుల్ బెడ్ రూమ్ తాళం ఇచ్చేది లేదంటూ బెదిరించినట్లు ఆరోపించాడు. దీంతో అటు పోలీసులు… ఇటు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కోసం డబ్బులు డిమాండ్ చేయడంతో దిక్కు తోచని స్థితిలోనే సెల్ టవర్ ఎక్కాల్సి వచ్చింది అన్నారు. ఈ విషయాలు తెలుసుకున్న జోగిపేట సీఐ నాగరాజ్ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడంతో కిందికి దిగాడు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.