- భీమగల్‌లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు రూ. 5 కోట్లు మంజూరు.
నిజామాబాద్ – అర్ముర్ : రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆర్మూర్ నియోజక పర్యటనలో భాగంగా.. స్థానిక ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలసి ఆసుపత్రిలో ప్రాంగణంలో తిరుగుతూ.. నిర్వహణ, పారిశుద్ధ్యం వంటి పనుల గురించి ఆరా తీశారు. చికిత్స పొందుతున్న పేషెంట్లను, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను ఆసుపత్రిలో అందిస్తున్న డైట్ ప్లాన్ గురించి అడిగి తెలుసుకున్నారు. మూడు పూటలా భోజనం అందిస్తున్నారా? లేదా? అనే విషయాలను వాకబు చేశారు. రోగులకు తగినటువంటి పోషికాహారం అందించాలని డాక్టర్లను సూచించారు.
ఆసుపత్రిలో ఫార్మసీ లాబ్ సౌకర్యాలు గురించి తెలుసుకున్న మంత్రి.. హై ఎండ్ అల్ట్రా సౌండ్ మెషిన్ ఉన్నప్పటికీ టిఫా(టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్) స్కానింగ్ మెషిన్ అందుబాటులో లేదని చెప్పగా వెంటనే టిఫా స్కాన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లు డయాలసిస్ సౌకర్యం లేనందువలన నిజామాబాద్‌కి వెళ్లాల్సి వస్తుందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. దీంతో మంత్రి వెంటనే స్పందించి 10 రోజుల్లో ఏరియా హాస్పిటల్‌లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంతవరకు నార్మల్ డెలివరీలనే చేయాలని మంత్రి వైద్య సిబ్బందికి సూచించారు.
వేల్పూర్:
ఈ పర్యటన అనంతరం బాల్కొండ నియోజకవర్గ వేల్పూర్ గ్రామానికి చేరుకున్నారు మంత్రి హరీశ్ రావు. అక్కడ ఆయనకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే మంత్రి వేముల కోరిక మేరకు.. భీమగల్‌లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు రూ. 5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.