- ఆగస్టు 1 నుంచి అమలు చేయనున్న ట్రాఫిక్ పోలీసులు
- బైక్, కారు, ఆటో.. వాహనం ఏదైనా సరే జరిమానా రూ.20 వేలు
- ప్రమాదాలను నివారించేందుకే అంటున్న ఏపీ ప్రభుత్వం
చెవులకు హెడ్ ఫోన్స్ తగిలించుకుని ఫోన్ మాట్లాడుతూనో, పాటలు వింటూనో వాహనం నడిపారంటే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ తో మోతమోగిస్తారు. వందా రెండొందలు కాదు.. ఏకంగా రూ.20 వేలు వసూలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల 1 నుంచి ఈ రూల్ అమలులోకి రానుంది. ఈమేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బైక్, స్కూటీల మీద వెళుతున్నపుడు మాత్రమే కాదు ఆటోలు, కార్లు.. వాహనం ఏదైనా సరే హెడ్ ఫోన్స్ పెట్టుకుని నడిపితే జరిమానా తప్పదని అధికారులు స్పష్టం చేశారు.
హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. వెనక వస్తున్న వాహనాలు హారన్ కొట్టినా వినిపించదని, ఓవర్ టేక్ చేసే సమయాల్లో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని వివరించింది. రోడ్డు ప్రమాదాలను నివారించే క్రమంలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాహనం నడపడాన్ని నిషేధించినట్లు వెల్లడించింది. వాహనం నడిపేటపుడు ఇయర్ ఫోన్స్, హెడ్ సెట్ పెట్టుకుంటే భారీగా ఫైన్ విధించాలని నిర్ణయించింది. ఇలా పట్టుబడ్డ వాహనదారులకు రూ.20 వేలు జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఆగస్టు 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది.