బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు గుంటూరు,పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అతి భారీ వర్షం కురిసింది. దాదాపు నెల రోజుల్లో కురవాల్సిన వర్షం కేవలం రెండు మూడు గంటల్లోనే కురిసింది. గుంటూరు తూర్పు మండలంలో 252.6 మిల్లీ మీటర్లు, పెదకాకానిలో 250.4, తాడికొండలో 228.8, చేబ్రోలులో 223, గుంటూరు వెస్టు 220,తుళ్లూరు 189.8, మంగళగిరి 170.8, తెనాలి 168.8, తాడేపల్లి 126.2, వట్టి చెరకూరు 109.0, కొల్లిపర 96.2, ఫిరంగిపురం 95 మిల్లీ మీటర్ల, కాకుమాను 92.6, మేడికొండూరు 88.6, పెదనందిపాడు 84,6,పత్తిపాడు 80.6,పొన్నూరు 67.4మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా మొత్తం మీద పగటి సమయంలో 12 గంటల వ్యవధిలో 147 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దుగ్గిరాలలో 140.8, మంగళగిరిలో 110.6, తాడికొండలో 104.2, తాడేపల్లిలో 124.8, తుళ్లూరులో 118.2, గుంటూరు తూర్పులో 96, తెనాలిలో 90. 4 , పశ్చిమలో 88.6, పెదకాకానిలో 88.6 వర్షం కురిసింది. గతరెండు రోజుల కాలంలో కురిసిన వర్షంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వాగులు, వంకలు, కాల్వలు పొంగి ప్రవహించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఇంత భారీ వర్షం ఇటీవల కాలంలో ఎప్పుడూ నమోదు కాలేదని అధికార వర్గాలు తెలిపాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు వరద వచ్చి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుంటూరు-అమరావతి-తాడికొండ-తుళ్లూరు మార్గాల్లో కొండవీటి వాగు, కోటేళ్లవాగులతో రాకపోకలు నిలిచిపోయాయి. పల్నాడు జిల్లాలో వాగులు పొంగుతున్నాయి. పులిచింతల ఎగువన, దిగువన భారీగా వర్షం కురవడంతో ప్రకాశం బ్యారేజికి ఆదివారం ఉదయానికి 4 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రికార్డు స్థాయిలో భారీ వర్షం కురవడంతో జనజీవనం అతాలాకుతలం అయింది.
ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వారు తిరిగి వెళ్లడానికి నానా తంటాలుపడ్డారు. రహదారులపై ఎటుచూపినా నీరు భారీగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేశారు. కొన్ని కార్యాలయాలకు అర్ధాంతరంగా సెలవు ప్రకటించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను పట్టించుకోని జిల్లా యంత్రాంగం విద్యాసంస్థలకు ఆలస్యంగా సెలవును ప్రకటించడంతో శనివారం ఉదయం విద్యార్థులను జోరు వానలోనేచాలా మంది పాఠశాలలకు తీసుకువెళ్లారు. 8 గంటల తరువాత సెలవు ప్రకటించడం వల్ల భారీ వర్షంలోనే విద్యార్థులు ఇంటికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి చెందిన ఘటన పెదకాకాని మండలం ఉప్పలపాడు వద్ద జరిగింది. భారీ వర్షంతో పంట నష్టంకూడా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. దాదాపు లక్ష ఎకరాల్లోకి వర్షం నీరు చేరిందని అంచనా. అయితే వర్షం నీరు బయటకుపోతే కానీ పైర్లకు ఎంత నష్టం జరిగింది. ఏ పైరు ఎంత వరకు నిలదొక్కుకోగలదో అంచనా వేయగలని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.