కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో నిలిచిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష తనకు భద్రత కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల ప్రచారంలో తన సోదరుడిపై దాడి జరగడంతో సెక్యూరిటీ అభ్యర్థించారు. అయితే, పోలీసులు తన విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంతో ఆమె కోర్టుకెక్కారు. ఎన్నికల బరిలో నిలిచిన నాటి నుంచి తనకు బెదిరింపులు ఎదురవుతున్నాయని, చంపేస్తామని ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు 2 ప్లస్ 2 గన్ మెన్లతో సెక్యూరిటీ కల్పించేలా పోలీసులను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. శుక్రవారం దీనిపై విచారణ జరిపి నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని కోర్టు వర్గాల సమాచారం.
బర్రెలక్కకు అంతర్జాతీయ న్యాయవాదుల సంఘం నాయకులు కావేట శ్రీనివాసరావు, కరణం రాజేశ్, ఆదిత్య దొడ్డల మద్దతు ప్రకటించారు. బర్రెలక్కపై, ఆమె సోదరుడిపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెదిరింపుల నేపథ్యంలో ఆమెకు 2 ప్లస్ 2 గన్ మెన్లతో సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన దాడిని ప్రస్తావిస్తూ హోంశాఖ ప్రధాన కార్యదర్శి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీచేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కోర్టు సానుకూలంగా స్పందించి బర్రెలక్కకు భద్రత కల్పించాలని తీర్పిస్తే దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు