గుజరాత్ – అహ్మదాబాద్: డెవలప్ మెంట్ పేరుతో ఆలయాన్ని కూల్చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ ఓ పూజారి ఆలయ ప్రాంగణంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుడి కూల్చివేతను ఎలాగైనా అడ్డుకో బిడ్డా అంటూ కొడుకుకు ఆత్మహత్య లేఖలో సూచించాడు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుందీ విషాద సంఘటన. బాధిత కుటుంబం, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుబేర్ నగర్ సంతోషి నగర్ లో ఓ ఆలయం ఉంది. ఈ గుడిలో మహేంద్ర మినేకర్ పూజారిగా వ్యవహరిస్తున్నారు.
1972లో సంతోషినగర్ ఏరియా అభివృద్ధిలో అంతంతమాత్రంగానే ఉన్న సమయంలో మహేంద్ర మినేకర్ తండ్రి ఈ గుడిని కట్టించారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ఏరియా బాగా డెవలప్ అయింది. ప్రస్తుతం ఈ ఆలయ స్థలంపై కన్నేసిన కొంతమంది రియల్టర్లు దానిని కూల్చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మహేంద్ర మినేకర్ కుటుంబం ఆరోపిస్తోంది. కార్పొరేషన్ అధికారులు కూడా బిల్డర్లకే వత్తాసు పలుకుతూ గుడిని కూల్చేందుకు పావులు కదుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తన తండ్రి మహేంద్ర మినేకర్ పై అధికారులు, బిల్డర్లు ఒత్తిడి తీసుకొచ్చారని, కొంతకాలంగా మానసికంగా వేధిస్తున్నారని బ్రిజేశ్ మినేకర్ చెప్పారు.
ఈ క్రమంలోనే ఆదివారం తన తండ్రి మహేంద్ర మినేకర్ గుడి ఆవరణలో బలవన్మరణానికి పాల్పడ్డాడని కంటతడి పెట్టారు. సూసైడ్ నోట్ లో గుడిని కాపాడాలని తనకు సూచించారంటూ బ్రిజేశ్ సోషల్ మీడియాలో ఓ వీడియో అప్ లోడ్ చేశారు. కాగా, మహేంద్ర మినేకర్ ఆత్మహత్యకు సంబంధించి బ్రిజేశ్ మినేకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాఫ్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. బ్రిజేశ్ ఆరోపణలపై సమగ్ర దర్యాఫ్తు జరిపిస్తామని వెల్లడించారు.