హరియాణాలోని కర్నాల్ లో జాతీయ రహదారి 44పై మంగళవారం భారీ ప్రమాదం జరిగింది. పానిపట్–చండీగఢ్ హైవేపై ఉన్న ఓ ఎలివేటెడ్ హైవే (ఫ్లైఓవర్)కు అడుగు వైపున ఏర్పాటు చేసిన 700 మీటర్ల పొడవైన వర్షపునీటి డ్రెయిన్ పైప్ 50 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కింద వెళ్తున్న వాహనదారులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. చాలా వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ జాం ఏర్పడింది. గాయపడ్డ వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినా భారీ ఇనుప పైప్ ను వారు పైకి లేపలేకపోయారు. చివరకు ప్రమాదవార్త అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఎలివేటెడ్ హైవేకు సమాంతరంగా ఏర్పాటు చేసిన పైప్ లైన్ పాతది కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.