హుకుంపేట: జిల్లలో నెట్వర్క్ సిగ్నల్స్ సరిగా లేని నేపధ్యంలో జిల్లా ప్రజలకు కమ్యూనికేషన్ మరియు డిజిటల్ సదుపాయాల కల్పనలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎయిర్టెల్, జియో, బీస్ఎన్ఎల్ నెట్ వర్క్ ల సేవల కోసం రెండు వేల పైగా సెల్ టవర్లు ఏర్పాటుకు కృషి చేస్తున్న విషయం విదితమే. అందులో భాగంగా గత ఆగష్టు నెలలో హుకుంపేట మండలం భీమవరం గ్రామంలో రిలయన్స్ జియో నెట్వర్క్ టవర్ నిర్మాణానికి జిల్లా కలక్టర్, ప్రొజెక్ట్ ఆఫీసర్, ఎంఎల్ఎ, తదితరులు భూమి పూజ చేసారు. ప్రస్తుతం సెల్ టవర్ నిర్మాణం పూర్తిచేసి సిగ్నల్ అందుబాటులోనికి తీసుకొని వచ్చారు. ఈ నేపథ్యంలో సిగ్నల్ వ్యవస్థ పనిచేసే తీరును జిల్లా కలక్టర్ సుమిత్ కుమార్ సోమవారం పరిశీలించారు. భీమవరం గ్రామంలో పర్యటించిన కలక్టర్ ముందుగా అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించి సిగ్నల్ గూర్చి ఆరాతీశారు. అదే విధంగా స్థల దాత, సర్పంచ్ సన్నిబాబుతో మాట్లాడి సిగ్నల్ ఉపయోగాల గురించి ఆరాతీసారు. ఇదివరకు సిగ్నల్ లేక ఎవరూ ఫోనులో మాట్లాడుకోనేవారు కాదని, ప్రస్తుతం సిగ్నల్ ఉండడం వలన ఇంట్లోనే ఉండి అందరితో మాట్లాడగలుగుతున్నామని, ఈ టవర్ ఏర్పాటు వలన చుట్టుప్రక్కల నాలుగైదు గ్రామాలు లబ్ది పొందుతున్నాయని వివరించారు. అదే విధంగా వివిధ లబ్దిదారులకు, టీచర్లకు, సచివాలయ సిబ్బందికి ఉపయోగపడుతున్న విధానంపై కలక్టర్ సంబంధిత వ్యక్తులతో మాట్లాడి తెలుసుకున్నారు. అంతేకాకుండా కలక్టర్ స్వయంగా వీడియో కాల్ చేసి మాట్లాడి సిగ్నల్ నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తపరిచారు.