అల్లూరి జిల్లా / హుకుంపేట : అంతటా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా ఇలా పంజా విసురుతున్నాయి. ప్రతి పల్లెలోనూ జ్వరపీడితులు మంచాన పడుతున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. గతం కంటే ఓపీకి వచ్చిన వారి సంఖ్య పెరిగింది. జ్వరమొస్తే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని జ్వరపీడితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
క్షీణించిన పారిశుధ్యం కూడా జ్వరాల విజృంభణకు ఒక కారణం. ఏ గ్రామంలోనూ పారిశుధ్యం మెరుగుకు చర్యలు చేపట్టే దాఖాలాలు లేవు. ఎక్కడికక్కడే మురుగు నిలిచిపోయి దోమలు విజృంభిస్తున్నాయి. ఈ దోమల బెడద వల్ల డెంగ్యూ, మలేరియా ప్రబలుతున్నాయి. ప్రతి 45 రోజులకోసారి ఫాగింగ్ ద్వారా దోమల నివారణకు చర్యలు చేపట్టాలి. కానీ ఆఊసే లేదు. మేజర్ పంచాయతీల్లో సైతం ఫాగింగ్ లేదు, పారిశుధ్యమెరుగుకు చర్యలు కానరావడం లేదు. తాగునీటి పథకాలు క్లోరినేషన్ చేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇక చిన్న పంచాయతీ గురించి వేరే చెప్పనవసరం లేదు. జ్వరాల అదుపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. వాన కాలం సీజన్ కొనసాగుతోంది. పారిశుధ్యం మెరుగు, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ప్రతి గ్రామంలోనూ వైద్య శిబిరాలు నిర్వహించాలని గిరిజన ప్రజలు కోరుతున్నారు.