- ఆలస్యంగా వెలుగులోకి వెలుగు చూసిన ఘోరం
- మృతుడు అల్లూరి జిల్లా వాసిగా గుర్తింపు
- అనకాపల్లి జిల్లా / అల్లూరి జిల్లా :చోడవరం /జి. మాడుగుల
చోడవరం మండలం గాంధీ గ్రామం పంచాయతీ మారుతీ నగర్ లో భార్య చేతిలో భర్త రుద్రాక్ష హరి విజయ్ (30) హతమైన ఘోర సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై చోడవరం స్టేషన్ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల కు చెందిన రుద్రాక్ష హరి విజయ్, తన భార్య ప్రీతి తో కలసి మారుతీ నగర్ లో నివాసం వుంటూ, చిరు ఫైనాన్స్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడని అన్నారు. వారి నివాసానికి సమీపంలో వుండే కొంత మంది వ్యక్తులతో మృతుడు భార్య ప్రీతి సన్నిహితంగా వుండేది అన్నారు. ఈ నేపథ్యంలో భార్య సెల్ ఫోన్ కు ఇతరుల నుండి అభ్యంతరకరమైన మెసేజ్ భర్త హరి విజయ్ కంట పడడంతో వారి కాపురంలో తగాదాలు మొదలయ్యాయని తెలియజేశారు. ప్రీతి తండ్రి జి.మాడుగుల కు చెందిన శంకర్రావు వారితో పాటు వుంటూ తన కుమార్తె కాపురంలో తగాదాలు చూస్తుండేవాడన్నారు. దీంతో ఈ నెల 17 రాత్రి ప్రీతి, ఆమెతో సన్నిహితంగా మెలిగే వ్యక్తులు, తండ్రి శంకర్రావు లు మృతుడు విజయ్ కి మద్యం బాగా తాగించి, ఊపిరి ఆడకుండా చంపేశారు అన్నారు. దీనిపై ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తెల్లవారితే 18 వ తేదీ ఉదయాన్నే చోడవరం నుండి జి.మాడుగుల ఆసుపత్రికి హరి విజయ్ శవాన్ని గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న సందర్భంలో పాడేరులో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానం వచ్చి వివరాలు అడగ్గా, తన భర్త విజయ్ కు గుండె నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళుతున్నామంటూ నమ్మబలికింది ప్రీతి. వివరాలు సేకరించిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు నిజాలు బయట పడ్డాయి. ఈ నేపథ్యంలో జి.మాడుగుల వైద్యులు కూడా హరి విజయ్ రెండు గంటల ముందే చంపబడ్డాడు అని నిర్ధారణ చేయడంతో పాడేరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే హత్య జరిగినది చోడవరం ప్రాంతం కావడంతో కేసు బదిలీ చేశారు. ఈ సంఘటన లో ఇపటివరకు ఒకర్ని అరెస్ట్ చేశామని, మృతుడు భార్య ప్రీతి సెల్ ఫోన్ కాల్ డేటా తనిఖీలు చేస్తున్నామని, దీంతో అసలు హంతకులు దొరికే అవకాశం ఉంది అని పోలీసులు తెలియజేశారు. అన్యోన్య దాంపత్యం లో ప్రీతి వివాహేతర సంబంధాలే తమ కుమారుడ్ని బలి తీసుకున్నాయి అని మృతుడు విజయ్ తల్లితండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై దోషులను కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.