తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది మేమే అని బీఆర్ఎస్ చెప్పుకుంటుంటే.. ఇచ్చింది తామే అని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. ఈ క్రమంలో.. తెలంగాణ ఇచ్చినందుకు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు, అమరజ్యోతి పక్కన ఆవిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ హాజరవుతారు.
సచివాలయం ముందు 2 ఎకరాల పార్కులో ఈ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీన్ని రాజీవ్ గాంధీ జయంతి నాడే ఆవిష్కరించాలి అనుకున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు సాయంత్రం 3.45కి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ కార్యక్రమంలా పాల్గొనేందుకు జిల్లాల నుంచి నేతలందరూ హైదరాబాద్ వచ్చేశారు.
ఈ విగ్రహం డిజైన్ ప్రత్యేకంగా ఉంది. రొటీన్‌గా అస్సలు లేదు. ఈ విగ్రహం తయారీకి సీఎం రేవంత్ రెడ్డి.. కొంత అన్వేషణ చేశారు. JNTU ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ సహా అమరజ్యోతిని డిజైన్ చేసిన ఆర్టిస్ట్ రమణారెడ్డిని కలిశారు. ఆయన రూపొందించిన విగ్రహాన్ని చూసి, కొన్ని మార్పులు చెప్పారు. ఫైనల్‌గా తయారైన విగ్రహం.. కుడి చేతితో ప్రజలపైకి పూల దండను విసురుతున్నట్లు ఉంటుంది. ఈ కాంస్య విగ్రహం 15 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనికి 1,800 కేజీల కంచును వాడారు.