భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు (సెప్టెంబరు 28) హైదరాబాద్ రానున్నారు. నల్సార్ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
రాష్ట్రపతి రాక నేపథ్యంలో రేపు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ మేరకు అదనపు సీపీ (ట్రాఫిక్) విశ్వప్రసాద్ వెల్లడించారు.
శనివారం ఉదయం 9 గంటల నుంచి బేగంపేట, హెచ్‌పీఎస్, పీఎన్‌టీ జంక్షన్, రసూల్‌పురా, సీటీవో ప్లాజా, టివోలీ, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని తెలిపారు.
నిన్న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్, తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తును పర్యవేక్షించాలన్నారు. అనంతరం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన 8 రాష్ట్రాలకు సంబంధించిన స్టాళ్లను, 4 ఫుడ్ కోర్టులను, మీడియా సెంటర్‌ను, ఇతర స్టాల్స్‌ను పరిశీలించారు.