హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి చేపట్టిన సెల్లార్ గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే… ఎల్బీనగర్ లోని చంద్రపురి కాలనీ(బీ)లో సెల్లార్ తవ్వకాలు చేపడుతున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ముల్లు పల్లి గ్రామానికి చెందిన కూలీలు పనులు చేస్తుండగా సెల్లార్ గోడ కూలింది. పనులు చేస్తున్న క్రమంలో సెల్లార్ కూలడంతో భారీ స్థాయిలో మట్టి మీదపడడంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల వివరాలు.. అలకుంట్ల వీరయ్య(48), వీరయ్య కుమారుడు అలకుంట్ల రాము(18), వీరయ్య బావమరిది ముద్దంగుల వాసు(17) మృతి చెందారు. నల్గొండ జిల్లా చింతపల్లికి చెందిన దశరథ(32) అనే కూలీ తీవ్రంగా గాయపడగా ఎల్బీనగర్ కామినేని దవాఖానకు తరలించారు.
