తెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ ద్వారా 23 మంది సైబర్ నేరస్థులను అరెస్టు చేశారు. ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి నిందితులను అరెస్టు చేయడం జరిగిందని సైబర్ క్రైమ్స్ డిప్యూటీ కమిషనర్ దారా కవిత తెలిపారు. అరెస్టయిన నిందితులకు తెలంగాణలో 30 కేసులలోను, మిగతా రాష్ట్రాలలో 359 కేసులలోను ప్రమేయం ఉన్నట్లు తేలిందని చెప్పారు.
సైబర్ క్రైమ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఐదు బృందాలతో 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను అధునాతన సాంకేతికతను వాడి పట్టుకున్నట్లు చెప్పారు. వీరు పెద్ద ఎత్తున ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు తెలిపారు. నిందితులు దేశ వ్యాప్తంగా పెట్టుబడి మోసానికి సంబంధించిన ఐదు, రెండు డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, మూడు ట్రేడింగ్ మోసాలు, రెండు ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడినట్లు వివరించారు. ఈ కేసుల్లో బాధితులు దాదాపు రూ.5.30 కోట్లు నష్టపోయారని చెప్పారు.
నిందితుల నుంచి రూ.40 వేల నగదు, 25 మొబైల్ ఫోన్లు, 45 సిమ్ కార్డులు, 29 బ్యాంకు పాస్‌బుక్‌లు/చెక్కుబుక్‌లు, 23 డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ల్యాప్‌టాప్, మూడు క్యూఆర్ కోడ్ స్కానర్లు, ఐదు షెల్ కంపెనీ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాల బృందాలతో సమన్వయం చేసుకున్నామని డీసీపీ తెలిపారు. ఈ ముఠా గుట్టురట్టు చేసేందుకు అధునాతన పరిశోధనా పద్ధతులను పాటించినట్లు చెప్పారు.
మూడు కేసుల్లో బాధితులకు పోలీసులు రూ.39 లక్షలు రికవరీ చేసి అందించారు. అపరిచితుల ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, చిన్న పెట్టుబడులపై అధిక రాబడిని వాగ్దానం చేసే వెబ్‌సైట్‌లకు ప్రజలు దూరంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని కాల్‌లు లేదా సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరాలపై సమీపంలోని పోలీస్ స్టేషన్‌లలో తక్షణం బాధితులు ఫిర్యాదు చేయాలని తెలిపారు.