అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భారీ స్థాయిలో డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో పట్టుబడ్డ డ్రగ్స్‌ను ధ్వసం చేశారు కస్టమ్స్ అధికారులు. ధ్వంసం చేసిన డ్రగ్స్ విలువ విదేశీ మార్కెట్‌లో సుమారు 950 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 23 రకాల మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలను దుండిగల్‌లోని హైదరాబాద్ వేస్ట్ మేనేజ్మెంట్ప్రాజెక్టులో అధికారులు ధ్వంసం చేశారు. 409 కిలోల ఆల్ఫాజోలం, 2655 కిలోల గంజాయి, 142 కిలోల ఎపిడ్రిన్ హైడ్రో క్లోరైడ్, 11 కిలోల హెరైన్, 74.92 కిలోల కెటమైన్, 2.95 కిలోల మెఫిడ్రోన్, 53.98 కిలోల మెటక్విలోన్, 55.95 కిలోల ఎఫిడ్రిన్ తయారీలో వాడే రసాయనాలను పూర్తిగా ధ్వంసం చేశారు హైదరాబాద్ పోలీసులు. కొంతకాలంగా కొకైన్ హెరాయిన్‌తోపాటు 16 రకాల డ్రగ్స్‌ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే పట్టుకున్నారు అధికారులు.
హైదరాబాద్‌లో పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఉక్కుపాదం మోపుతున్నా.. డ్రగ్ రాకెట్లు బయటపడుతూనే ఉన్నాయి. మత్తుకు బానిసగా మారిన యువతను టార్గెట్ చేసుకున్న మాఫియా.. చివరకు వారినే ఏజెంట్లుగా మార్చి చాపకింద నీరులా తమ సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తోంది. ఈ క్రమంలోనే.. మాదకద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దంటున్నారు పోలీసులు, నిపుణులు. దేశానికి ఆదర్శంగా నిలవాల్సిన యువత డ్రగ్స్ మాయలో పడటం దురదృష్టకరమన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా యువతను రక్షించడం కోసమే అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు హైదరాబాద్ సిటీ పోలీసులు.