ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) విధివిధాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు శుక్రవారం జీవో 99 జారీ చేసింది. జీహెచ్ఎంసీతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలను కలుపుకొని ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాలను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్)గా ఏర్పాటు చేసింది. ఓఆర్ఆర్ దాకా హైడ్రాకు అధికార పరిధిని అప్పగించింది. హైడ్రా చైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరించనున్నారు. జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 మేజర్ గ్రామ పంచాయతీలు హైడ్రా ఆధ్వర్యంలో కొనసాగుతాయి.
ఇవీ విధులు
ప్రణాళిక, నిర్వహణ, సమన్వయం, కార్యాచరణ అమలు కోసం ప్రత్యేక ఏజెన్సీగా హైడ్రా ఉంటుంది. టీసీయూఆర్ ప్రాంతంలో ఏదైనా విపత్తు తలెత్తితే వెంటనే రెస్క్యూ కార్యకలాపాల కోసం సిద్ధంగా ఉండాలి. విపత్తు నిర్వహణ బాధ్యతలను హైడ్రా కమిషనర్ నిర్వర్తిస్తారు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి మార్గదర్శకంలో కమిషనర్ నేతృత్వంలో పనిచేసేలా హైడ్రాకు ప్రత్యేక హెచ్‌వోడీ ఉంటారు. జీహెచ్ఎంసీ, అన్ని యూఎల్బీ, ఆర్ఎల్బీలు కలుపుకొని ఓఆర్ఆర్ పరిధి వరకు హైడ్రా పర్యవేక్షిస్తుంది. అసెట్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లాజిస్టిక్ సపోర్ట్ వింగ్‌లు హైడ్రా ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ, ఈవీడీఎం పరిధిలో ఉన్న అధికారయంత్రాంగం, సిబ్బంది, మౌలిక సదుపాయాలు, వాహనాలు మొదలైనవి హైడ్రాలో భాగమై ఉంటాయి. అంతర్గత విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు జీహెచ్ఎంసీ వద్దే ఉంటాయి. పోస్టులు, సిబ్బంది, వాహనాలు, ఇతర అవసరాలకు బడ్జెట్ ప్రతిపాదనలను హైడ్రా కమిషనర్ సమర్పించాలి. హైడ్రా కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జీవోలో వెల్లడించారు.
12 మందితో పాలకమండలి
హైడ్రా పాలకమండలి చైర్మన్‌గా సీఎం హో దాలో రేవంత్‌రెడ్డి, ఎంఏయూడీ మినిస్టర్ హో దాలో సభ్యుడిగానూ రేవంత్‌రెడ్డి ఉంటారు. రె వెన్యూ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జి ల్లాల ఇన్చార్జి మంత్రులు, జీహెచ్ఎంసీ మేయ ర్, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హెడ్ సభ్యులుగా ఉంటారు. హైడ్రా కమిషనర్‌గా నియమించిన ఐపీఎస్ ఆఫీసర్ ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
15 మందితో సబ్ కమిటీ
ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాలను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్)గా ఏర్పాటు చేసున్నట్టు 99 జీవోలో పేరొన్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్-2005 ప్రకారం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ పేరుతో 15 మంది అధికారులతో కూడిన ఇంకో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా ఉంటారు. హైడ్రా కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పీసీసీఎఫ్, డిజాస్టర్ రెస్పాన్స్ డీజీ, ఫైర్ సర్వీసెస్ డీజీ, మెట్రో వాటర్, సీవరేజీ బోర్డు ఎండీ, హెచ్ ఎండీఏ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్, మెట్రో రైల్ ఎండీ, ఎస్పీడీసీఎల్ ఎండీ, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ, టీసీయూఆర్ పరిధిలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. ఈ సబ్ కమిటీ చైర్మన్ సమాయానుకూలంగా ఇతర సభ్యులను నామినేట్ చేస్తారని జీవోలో పేరొన్నారు. టీక్యూర్ సబ్ కమిటీ పాలకమండలికి సహాయ సహకారాలు అందిస్తుంది. విపత్తు నిర్వహణ, ప్రణాళికలు, విధివిధానాలను అమలుచేయడంలో ఒక పాలకమండలి తరహాలో వ్యవహరించనున్నది. కాగా ఈ పాలకమండలిలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల మేయర్లు, చైర్మన్లు, సర్పంచులకు చోటు దక్కలేదు.