హైదరాబాద్ : అల్కాపురిలోని కొన్ని అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా విసిరింది. ‘మార్నింగ్ రాగా’ అపార్ట్ మెంట్ లో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన షట్టర్లను (దుకాణాలను) హైడ్రా నేడు తొలగించింది.
ఈ షట్టర్లకు సంబంధించి మణికొండ మున్సిపాలిటీ అధికారులు నవంబరు 27నే నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో షట్టర్లను తొలగించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ, ఆ షట్టర్ల సొంతదారుల నుంచి స్పందన లేదు. దాంతో, మున్సిపల్ అధికారులు ఈ విషయాన్ని హైడ్రాకు నివేదించగా, హైడ్రా రంగంలోకి దిగి ఆ షట్టర్లను కూల్చివేసింది.
ఈ సందర్భంగా, అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. హైడ్రా సిబ్బందిని, పోలీసులను అడ్డుకునేందుకు అపార్ట్ మెంట్ వాసులు ప్రయత్నించారు. అయితే, ఆ షట్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, అందుకే తొలగిస్తున్నామని హైడ్రా సిబ్బంది స్పష్టం చేశారు.