సంగారెడ్డి జిల్లా కొండాపూర్: చెరువులు, కుంటలు పూడ్చి ఆ స్థలాన్ని కబ్జా చేయడం చూస్తూనే ఉన్నాం.. ఇలాంటి ఆక్రమణలను, ఆ భూమిలోని నిర్మాణాలను ప్రస్తుతం హైడ్రా నిర్దాక్షిణ్యంగా కూల్చేయడమూ చూస్తున్నాం. అయితే, సికింద్రాబాద్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా చెరువులోనే ఇల్లు కట్టేశాడు. చెరువు నీళ్లలో కట్టాడని చిన్నపాటి ఇల్లు అనుకుంటున్నారేమో.. ఒకటీ రెండు కాదు నాలుగు అంతస్తులు నిర్మించాడు. బిల్డింగ్ లోకి వెళ్లేందుకు ఒడ్డు నుంచి చిన్నపాటి బ్రిడ్జిని కూడా కట్టించుకున్నాడు.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కుతుబ్‌శాయి పేట్ గ్రామంలోని చెరువులో ఈ బిల్డింగ్ కట్టారు. వారాంతంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వెళ్లి సరదాగా గడిపి వస్తుండేవాడు. పన్నెండేళ్ల క్రితం నిర్మించిన ఈ బిల్డింగ్ ను తాజాగా అధికారులు బాంబులు పెట్టి కూల్చేశారు. చెరువును ఆక్రమించి కట్టడంతో కూల్చివేశామని అధికారులు వివరించారు. కూల్చివేతకు సంబంధించిన వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా అదికాస్తా వైరల్ గా మారింది. 12 ఏళ్ల క్రితం చెరువులో నాలుగు అంతస్తుల బిల్డింగ్ కట్టగా.. అధికారులు ఇంతకాలం ఏంచేస్తున్నారని నెటిజన్లు నిలదీస్తున్నారు.