దేశవ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. 31 శాతం ప్రాంతాల్లో తీవ్ర పొడి వాతావరణం నెలకొంది. దీని తీవ్రత మధ్యస్థం నుంచి తీవ్రంగా ఉన్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ బులెటిన్ విడుదల చేసింది. ఈ పరిస్థితులు వ్యవసాయంపై, పంటల దిగుబడిపై, నేలలోని తేమపై పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తాయని తెలిపింది. వర్షాభావం ఉన్నట్టు ఐఎండీ ప్రకటించింది. నెల రోజులు నుంచి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆగస్ట్ నెలలో వర్షపాతం ఇప్పటి వరకు చాలా కనిష్ఠ స్థాయిలో ఉంది.
‘‘దేశవ్యాప్తంగా 31 శాతం ప్రాంతాల్లో తీవ్ర పొడి వాతావరణం ఉంటే, 9 శాతం ప్రాంతాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంది. మరో 4 శాతం ప్రాంతాల్లో ఇంతకంటే ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ భారత్, మహారాష్ట్ర, గుజరాత్, తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా మరో 47 శాతం ప్రాంతాల్లోనూ తక్కువ స్థాయి పొడి వాతావరణం ఉంది’’ అని ఐఎండీ పేర్కొంది. వచ్చే రెండు వారాలు ఎంతో కీలకమని ఐఎండీ శాస్త్రవేత్త రజిబ్ ఛాత్రోపాధ్యాయ తెలిపారు.
ఇక ఇదే వాతావరణం పరిస్థితులు మరో రెండు వారాల పాటు కొనసాగితే, అప్పుడు నీటికి లోటు ఏర్పడొచ్చని అంచనా వేశారు. వర్షాకాలం సీజన్ జూన్ 1 నుంచి ఆగస్ట్ 23 వరకు చూస్తే చాలా జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులే ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. ఎల్ నినో కారణంగా ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చంటూ నిపుణులు ముందే అంచనా వేయడం గమనార్హం.