హైదరాబాద్/ యూసఫ్ గూడా / మధురానగర్ : నగరంలో మునిసిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు మారడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మిస్తున్నా అధికారులు ఆ వైపునకు కన్నెత్తి చూడటం లేదు. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిబంధనలను తుంగలో తొక్కి భవనాల నిర్మాణం చేస్తున్నా పట్టించుకోకుండా ఉండటం విమర్శలకు తావిస్తోంది. తమను ప్రసన్నం చేసుకుంటే అక్రమ కట్టడాలను సక్రమం చేస్తున్నారనే ఆరోపణలను మూటగట్టుకుంటున్నారు. కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారుల తీరు కారణంగా నగరంలో అక్రమ కట్టడాల నిర్మాణం మూడు అంతస్తులకు అనుమతులు, ఐదు, ఆరు అంతస్తుల్లో నిర్మాణాలు అన్న చందంగా సాగిపోతోంది.
యూసఫ్ గూడా మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి అత్యంత సమీపంలో అలాగే మధురానగర్ హైడ్రా కమీషనర్ ఏవి రంగనాథ్ ఇంటికి కూతవేటు దూరంలో (A-41) నిబంధనలకు విరుద్ధంగా ఆరు అంతస్తుల భవనం నిర్మించారు. అడ్డగోలుగా నిర్మాణం చేసినా టౌన్‌ప్లానింగ్ అధికారులు పట్టించుకోలేదు. ఇటీవలే ఆరు వ అంతస్తు అలాగే పెంట్ హౌస్ కు శ్లాబు కూడా వేశారు. అయినా ఈ భవన నిర్మాణంవైపు టౌన్‌ప్లానింగ్ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఐదు అంతస్తుల భవనం సెట్ బ్యాక్ లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం పూర్తి కావొస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చలనం లేదు అధికారులలో.
అక్రమ నిర్మాణాలపై నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హైకోర్టు తేల్చిచెప్పింది. టోలిచౌకీ యూసుఫ్ టేక్డి నిజాం కాలనీలోని ఓ అక్రమ నిర్మాణానికి సంబంధించి అధికారులు సరిగా స్పందించకపోవడంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ప్రత్యక్షంగా హాజరుకావాలని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీచేసింది. దాంతో.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ డిసెంబర్ 19 / 2024 న ప్రత్యక్షంగా జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ఆస్తిపన్ను వసూళ్లపై ఉన్న శ్రద్ధ ఇతర విధులపై ఉండడం లేదు. రోజురోజుకూ జీహెచ్‌ఎంసీపై ప్రజ లు నమ్మకం కోల్పోతున్నారు. వేలల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే.. కోర్టులకు వెళ్లినప్పుడు ‘చూద్దాం లే’ అన్నట్లు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఫిర్యాదు చేసినా.. స్పందించడం లేదు’’ అంటూ ధర్మాసనం ఆక్షేపించింది. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే పట్టించుకోని అధికారుల ను బాధ్యులను చేస్తూ.. వారిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సూచించింది. ఇకనైనా అధికారులు స్పందిస్తారా లేదా వేచి చూడాలి …