contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రాజ్యసభ ఛైర్మన్ పై ‘ఇండియా కూటమి’ అవిశ్వాస తీర్మానం

ఢిల్లీ : రాజ్యసభ ఛైర్‌పర్సన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌పై ఇండియా కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. మంగళవారం రాజ్యసభ సచివాలయంలో నోటీసు ఇచ్చాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 60 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేశారు. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎమ్​, జేఎమ్​ఎమ్​కు చెందిన దాదాపు 60 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేశారు. అయితే, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్​పర్సన్ సోనియా గాంధీ, ఇతర పార్టీల ఫ్లోర్​ లీడర్లు తీర్మానంపై సంతకాలు చేయలేదు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు తీర్మానంపై సంతకం చేయలేదని ఆ పార్టీ వెల్లడించింది.

మంగళవారం వివిధ అంశాలపై అధికార-ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో పార్లమెంటు ఉభయసభలు వాయిదాపడ్డాయి. ఆ తర్వాత విపక్ష పార్టీల ఎంపీలు రాజ్యసభ ఛైర్‌పర్సన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానానికి నోటీసు అందజేశాయి. సభలో ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

రాజ్యసభలో ఛైర్మన్ అత్యంత పక్షపాత ధోరణితో వ్యవహరించినందుకు గాను ఆయనపై ఇండియా కూటమి పార్టీలకు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం తప్ప మరో మార్గం లేకపోయింది. ఇది ఇండియా పార్టీలు తీసుకున్న బాధాకరమైన నిర్ణయం. కానీ ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా వారు ఈ చర్య తీసుకోక తప్పలేదు.” అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ(ఇంఛార్జ్, కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ ఎక్స్​లో పోస్ట్ చేశారు. “ఈ తీర్మానం గెలిచే సభ్యుల బలం మాకు లేదు. కానీ ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కోసం పోరాడాలనే బలమైన సందేశం. వ్యక్తులకు వ్యతిరేకంగా ఏమీ లేదు, ఇది సంస్థల కోసం పోరాటం.” అని టీఎంసీ ఎంపీ సాగరిక ఘోష్ అన్నారు. ఇదిలా ఉండగా, ఉపరాష్ట్రపతికి వ్యతిరేకంగా తీర్మానం ప్రతిపాదించడానికి ప్రతిపక్షాలు ఈ ఏడాదిలో ఆగస్టులో కూడా ప్రయత్నాలు చేశాయి.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(బీ) ప్రకారం కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (రాజ్యసభ) తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతిని ఆయన / ఆమెను పదవి నుంచి తొలగించవచ్చు. ఆ తీర్మానాన్ని ఆ సమయంలో సభలో ఉన్న సభ్యుల్లో మెజారిటీ ఆమోదించాలి. అయితే ఆ తీర్మానాన్ని ప్రతిపాదించడానికి కనీసం 50మంది సభ్యులు ఉండాలి.

అవిశ్వాస తీర్మానం విచారకరం – రిజిజు
ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్​పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం చాలా విచారకరమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు. రాజ్యసభ ఛైర్మన్‌ను చూసి ప్రభుత్వం గర్విస్తోందని, ఆయన నిష్పాక్షికంగా వ్యవహరిస్తారని కొనియాడారు. ఎగువసభలో తమ కూటమికి మెజార్టీ ఉందన్న ఆయన రాజ్యాసభ ఛైర్మన్‌పై తమకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. రాజ్యసభ ఛైర్మన్ స్థానానికి ఉన్న గౌరవాన్ని ఇండియా కూటమిలోని పార్టీలు అగౌరపరుస్తున్నాయని ఆరోపించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :