భారత నావికాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఇరాన్ నుంచి కిడ్నాప్ చేయడంలో సహకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ స్కాలర్ ముఫ్తీ షా మిర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బలూచిస్థాన్‌లో శుక్రవారం రాత్రి జరిగిందీ ఘటన. రిలిజియస్ స్కాలర్ అయిన ముఫ్తీ గతంలో రెండుసార్లు కాల్పుల నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు మాత్రం తూటాల నుంచి తప్పించుకోలేకపోయాడు.
శుక్రవారం రాత్రి టుర్బట్‌లోని స్థానిక మసీదులో ప్రార్థనలు ముగించుకొని వస్తున్న మిర్‌ను మోటార్ సైకిల్‌పై వెంబడించిన సాయుధులు పాయింట్ బ్లాంక్‌లో పలుమార్లు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన మిర్ అదే రోజు ఆసుపత్రిలో మరణించాడు.
ఛాందసవాద పార్టీ అయిన జమియత్ ఉలేమా-ఈ-ఇస్లామ్ (జేయూఐ)లో మిర్ సభ్యుడు. స్కాలర్ ముసుగులో ఆయుధాలు, మానవ అక్రమ రవాణా వంటి పనులు చేసేవాడు. ఐఎస్ఐకి కూడా అతడు అత్యంత సన్నిహితుడు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను అతడు తరచూ సందర్శించేవాడు. అంతేకాదు, భారత్‌లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు సాయం చేసేవాడు. కాగా, గతవారం ఖుజ్దార్‌లో మిర్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు కూడా కాల్చివేతకు గురయ్యారు.