ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రను ప్రారంభించి ఏడాది కావస్తోంది. ఈ యుద్ధం విషయంలో భారత్ ఎవరికీ అనుకూలంగా వ్యవహరించకుండా తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. తాజాగా భారత్ మద్దతును ఉక్రెయిన్ కోరింది. ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టబోయే శాంతి ప్రణాళికకు అనుకూలంగా వ్యవహరించాలని కోరుతూ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కు ఆ దేశ అధ్యక్ష కార్యాలయ చీఫ్ ఆండ్రీ యెర్మాక్ ఫోన్ చేశారు. తమకు భారత్ సహకారం ఎంతో ముఖ్యమని… తమ శాంతి తీర్మానానికి ఇండియా మద్దతును ఇస్తుందని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. తమ లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయని… రష్యాకు చెందిన ఒక్క సెంటీమీటర్ భూమిని కూడా తాము కోరుకోవడం లేదని తెలిపారు.
యుద్ధాన్ని ముగించడానికి ఏం చేయాలనేది తమ శాంతి ప్రణాళికలో వివరించామని చెప్పారు. కాల్పుల విరమణ వంటి తాత్కాలిక చర్యలను తాము కోరుకోవడం లేదని… తమ భూభాగం నుంచి రష్యా వెళ్లిపోవాలని తాము కోరుతున్నామని అన్నారు. ఈ ఏడాది యుద్ధానికి ముగింపు పడుతుందనే ఆశాభావంతో తాము ఉన్నామని చెప్పారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో రేపు శాంతి ప్రణాళికను ఉక్రెయిన్ ప్రవేశపెట్టబోతోంది. గత ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించింది.