దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో ఉన్న అతిపెద్ద ఆస్పత్రిపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, పదుల సంఖ్యలో రోగులు గాయపడ్డారు. గాజా ఆరోగ్య శాఖ వెల్లడించిన ప్రకటన ప్రకారం, ఈ దాడి కారణంగా ఆస్పత్రి సర్జికల్ భవనంలో మంటలు చెలరేగాయని పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం కూడా ఈ దాడి గురించి ధ్రువీకరించి, హమాస్ మిలిటెంట్లు ఆస్పత్రిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, అందుకే దాడి చేశామని వివరించింది.
ఈ దాడి అనంతరం గాజా పట్టణంలో ఇజ్రాయెల్ సైన్యం గలిగిన ప్రస్తుత దాడులలో 26 పాలస్తీనియన్లు మరణించారు. గాజా ఆరోగ్య శాఖ ప్రకారం, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు 50,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 1.13 లక్షల మందికి పైగా గాయపడ్డారు.
ఆదివారం, ఖాన్ యూనిస్ నగరంలో ఇజ్రాయెల్ నిర్వహించిన దాడిలో హమాస్ కీలక నేత సలాహ్ అల్ బర్దావీల్ (66) మృతి చెందారు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో జన్మించిన బర్దావీల్, హమాస్ సీనియర్ నేత యాహ్యా సిన్వర్‌కు సన్నిహితుడు. ఇజ్రాయెల్ దాడుల్లో సిన్వర్, ముస్తాహాలు చనిపోయినప్పటి నుంచి బర్దావీలే హమాస్‌లో కీలకనేతగా ఉన్నారు.
ఇక, గాజా నుండి పాలస్తీనియన్లను తరలించేందుకు ఇజ్రాయెల్ కొత్త డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని శనివారం ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదించింది. అగ్రరాజ్యాధికారి డొనాల్డ్ ట్రంప్ ఇటీవల గాజా నుంచి పాలస్తీనియన్లను జోర్డాన్, ఈజిప్టు వంటి దేశాలకు శాశ్వతంగా తరలించేందుకు సూచించారు. ఈ నేపథ్యంలో, ఈ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఇజ్రాయెల్ ఈ తరలింపును నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
ఇటీవల, ఇజ్రాయెల్-హమాస్ మధ్య మొదటి దశ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన నేపథ్యంలో, గాజాపై ఐడీఎఫ్ దళాలు భారీ దాడులు నిర్వహించాయి. ఈ దాడిలో 400 మందికి పైగా మరణించారు, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపిన ప్రకారం, ఈ దాడులు హమాస్ బందీలను విడుదల చేయకపోవడమే కారణమని ఆయన వెల్లడించారు. హమాస్ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది, ఇజ్రాయెల్ దీని కొరకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఈ క్రమంలో, గురువారం జరిపిన దాడుల్లో 85 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ మాట్లాడుతూ, హమాస్ బందీలను విడిచిపెట్టకపోతే గాజాలోని భూభాగాలను ఒకొక్కటిగా ఆక్రమిస్తామని హెచ్చరించారు.