హైదరాబాద్ : తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో పన్నెండు గంటలుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు, ఆయన తమ్ముడు శిరీష్, కూతురు హన్సితతో పాటు పలువురు బంధువులు, భాగస్వాముల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు భార్య తేజస్వినితో అధికారులు బ్యాంకు లాకర్‌ను తెరిపించారు. ఈ సోదాల్లో పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ సంస్థలకు చెందిన నిర్మాతల ఇళ్లు, కార్యాలయాలల్లోనూ అధికారులు తనిఖీలు జరిపారు. 55 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఏకకాలంలో 8 చోట్ల తనిఖీలు ప్రారంభించారు.
భారీ బడ్జెట్ సినిమాల పెట్టుబడి, కలెక్షన్లను ఐటీ శాఖ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎస్వీసీ సంస్థ బ్యాలెన్స్ షీట్, ఐటీ రిటర్న్స్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. దిల్ రాజుకు చెందిన దిల్ రాజు కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ కంపెనీలోనూ సోదాలు నిర్వహించారు.
సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు రావడంతో ఆయన నిర్మాణ సంస్థల ఆదాయ వివరాలను ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. కొన్ని సినిమా ఫైనాన్స్ సంస్థల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సత్య రంగయ్య ఫైనాన్స్ కంపెనీ ఆఫీసులో సోదాలు చేశారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇళ్లలోనూ సోదాలు చేశారు. జుబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్‌లలోని పలువురు బడా నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.