పిఠాపురం : మాల సంఘాల జెఎసిలా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్న మాల మాహగర్జనను విజయవంతం చేయాలని మాల సంఘాల జెఎసి పిలుపునిచ్చింది. ఆదివారం సాయంత్రం పిఠాపురం పట్టణంలోని స్థానిక రథాలపేట సెంటర్లో వున్న అంబేద్కర్ భవనంలో మాల సంఘాల జెఎసి నాయకుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా మాల సంఘాల జెఎసి నాయకులు మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద జరగబోయే మాల మహాగర్జన సభను విజయవంతం చేయాలని కోరారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు, క్రిమీలేయర్కు సుప్రీంకోర్టు అనుకూల సూచన ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయుటకు అనుకూలంగా వ్యవహరించుచున్నది. ఒక ప్రక్క జాతీయ స్థాయిలో మాయావతి, చిరాగ్ పాశ్వాన్, ఆజాద్ రావణ్, రామ్ దాస్ అథవాలే లాంటి దిగ్గజ మాదిగ నేతలే ఎస్సీ వర్గీకరణ చేయవద్దంటూ మనువాద పార్టీలకు వ్యతిరేకంగా పోరాడుతూ, తమ గళాన్ని విప్పుతుంటే, తెలుగు రాష్ట్రాలలో మాత్రం మంద కృష్ణ మాదిగ మనువాద భావజాలం కలిగిన పార్టీలకు మద్దతునివ్వడం శోచనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సామాజిక వర్గం మాల సామాజిక వర్గమని, కానీ వివిధ రాజకీయ పార్టీలు మాలలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటూ నిత్యం మాలలను అణగద్రొక్కుతున్నారన్నారు. కాబట్టి ఇప్పటికైనా మాలలు ఐకమత్యంతో ఒక త్రాటిపైకి వచ్చి ఎస్సీ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమీషన్ను రద్దుచేసి ఎస్సీ వర్గీకరణను విరమించుకోవాలనే డిమాండ్ భావితరాల భవిష్యత్ కోసం మనమందరం కదిలి వెళ్ళి గుంటూరులో జరుగనున్న మాలల మహా గర్జనను విజయవంతం చేయాలన్నారు. అనంతరం “ఛలో గుంటూరు” కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి, పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్జి ఖండవల్లి లోవరాజు, పచ్చిమల్ల అప్పలరాజు, 16వ వార్డు కౌన్సిలర్ పెదపాటి రాజేష్ కుమార్, ఉలవల భూషణం, వజ్రపు బాబీ, ఖండవల్లి చిన లోవరాజు, బత్తిన శామ్యూల్, కొంగు నూకరాజు, డా. బొండాడ దాసు, ఉపాధ్యాయుడు పోతుల శ్రీనివాస్, బిజెపి ఎస్సీ టౌన్ పెసిడెంట్ ఖండవల్లి మారేష్, ఏవైఎం ప్రెసిడెంట్ చిల్లి నూకరాజు, మాతా నాగేశ్వరరావు, గుర్రాల ఏసురత్నం, కూసి నూకరాజు, పవన్ తదితరులు పాల్గొన్నారు.