ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరిపాలనపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పాలనలో మాదిగలకు సంక్షేమం లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. గడిచిన ఐదేళ్లలో జగన్ తమ జాతికి ఎలాంటి మేలు చేయలేదని, మరోసారి గెలిచిన తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. జగన్ ను ఓడించి తగిన బుద్ది చెబుతామన్నారు.
తగిన బుద్ధి చెబుతాం..
ఈ మేరకు మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని అంబేడ్కర్ భవన్లో మీడియాతో మాట్లాడిన మందకృష్ణ.. మాదిగల సంక్షేమం పట్ల సీఎంకు చిత్తశుద్ధి లేదన్నారు. ఇటీవల ప్రకటించిన పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల్లో కూడా మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో జగన్కు వ్యతిరేకంగా పోరాటం చేసి తగిన బుద్ధి చెబుతామని చెప్పారు.