జగిత్యాల జిల్లా కేంద్రం : అది ఫారెస్ట్ ఆఫీసు. అక్కడ పనిచేసే అధికారులు విధులు ముగిశాక ఇంటికి వెళ్లాలి. నైట్ డ్యూటీ ఉన్నవారు ఆఫీసులో అందుబాటులో ఉండాలి. అయితే.. నైట్ ట్యూటీలో ఉన్నవారితోపాటు.. అక్కడ లిక్కర్ సీసాలు డ్యూటీ చేశాయి. ఏకంగా ఫారెస్ట్ ఆఫీసులోనే కొందరు మద్యం తాగారు. ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
జగిత్యాల ఫారెస్ట్ ఆఫీస్‌లో లిక్కర్ దావత్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వన్య ప్రాణి మాంసంతో ఫారెస్ట్ ఆఫీసర్లు దసరా దావత్ చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నెమలి, అడవి పంది మాంసంగా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఫారెస్ట్ ఆఫీసులో పార్టీ చేసుకున్న వారు తిన్న మాంసం శాంపిల్ తీసుకుని ల్యాబ్‌కి పంపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శాంపిల్‌కు పంపిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ దావత్‌లో జిల్లా ఫారెస్ట్ సిబ్బంది, కొందరు బీట్, సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే.. పార్టీ జరుగుతుండగా.. కొందరు మీడియా ప్రతినిధులు ఇదేంటని ప్రశ్నించగా.. వారిపట్ల దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది.
దీనిపై మీడియా ప్రతినిధులు జిల్లా అటవీశాఖ అధికారిని వివరణ కోగా.. తనకు సమాచారం లేదని చెప్పినట్టు సమాచారం. నిజంగానే ఫారెస్ట్ ఆఫీసులో ఇలాంటి పనులు చేస్తే.. శాఖా పరమైన చర్యలు ఉంటాయని జిల్లా అధికారి స్పష్టం చేశారు. ఇటు నెటిజన్లు ఈ ఘటనపై సెటైర్లు వేస్తున్నారు. వారికి మాత్రం దసరా పండగ లేదా అని పంచ్‌లు పేలుస్తున్నారు.
జూన్ నెలలో ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. రవాణాశాఖ కార్యాలయంలో బీరు తాగుతూ విధులు నిర్వహించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సురేశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. అతడి పేరును బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు.. జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి, ఎంవీఐ ఎండీ గౌస్‌పాషాకు ఉన్నతాధికారులు ఛార్జ్‌మెమో జారీ చేశారు. కార్యాలయంలోకి మద్యం తీసుకొచ్చిన ఇద్దరు ఆర్టీఏ ఏజెంట్లు మధు, సాధిక్‌తోపాటు సురేశ్‌పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.