జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంతో పాటు గ్రామ గ్రామాన జాతీయ జెండాలు రెపరెపలాడాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరియు జిల్లా స్థాయి అధికారులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవంగా స్వీకరించారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన పలువురికి ప్రశంస పత్రాలను అందజేసిన ఆయన వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి అభినందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ … ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మని, భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం 26 జనవరి 1950 న అమలులోకి వచ్చిందని అప్పటి నుంచి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశం అన్నిరంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించిందని అలాగే తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని కలెక్టర్ సత్య ప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయ, పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి కల్పన, అభివృద్ధి సంక్షేమంతో పాటు ఐటీ నుంచి అగ్రికల్చర్ వరకు అన్నిరంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ అనతికాలంలో దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల, రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా, రేషన్ కార్డులు అందరికి అందజేయడం జరుగుతుందని అన్నారు.