జగిత్యాల జిల్లా : ఓ ప్రముఖ ఛానల్ విలేకరిని అని చెప్పుకుని ఓ జిల్లా అధికారి వద్దనుండి రూ.8.50 లక్షలు వసూలు చేసి, మరిన్ని డబ్బుల కోసం డిమాండ్ చేయగా బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆ నకిలీ విలేకరితోపాటు మరొకరిని పోలీస్ లు పట్టుకొని అరెస్టు చేశారు. ఇదే కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. కేసుకు సంబంధించిన వివరాలను డి.ఎస్.పి రఘు చందర్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లా పరిశ్రమల కేంద్రంలో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న ఎర్ర యాదగిరి వద్దకు ఓ ప్రముఖ చానల్ విలేకరిగా చెప్పుకొని తమ బంధువులకు సబ్సిడీ లోన్ కావాలని రాయికల్ మండలం వడ్డె లింగాపూర్ కు చెందిన భూక్య సంతోష్ నాయక్ వెళ్ళాడు. పథకం ప్రకారం తన వెంట వచ్చిన మహిళతో రూ. 5వేలు పరిశ్రమల శాఖ అధికారికి ఇప్పించి రహస్యంగా వీడియో తీశాడు. అదే రాత్రి వీడియోను యాదగిరి కి పంపి నీవు లంచం తీసుకున్న విషయం మా ఛానల్లో వేస్తామని బ్లాక్మెయిల్ చేయడంతో ఆయన భయపడి రు.1లక్ష అందజేశాడు. దీంతో ఆగకుండా విషయం మా ఛానల్ యాజమాన్యానికి తెలిసిందని రు.10 లక్షలు ఇస్తేనే మా చానల్లో ప్రసారం కాకుండా చేస్తానని బెదిరింపులకు దిగడంతో విడుతలవారీగా రు.8.50 లక్షలు సంతోష్ కు అందజేశాడు. ఇంతటితో ఆగకుండా తాను విలేకరిని కాదని పోలీసు ఇంటలిజెన్స్ అధికారిని అని మీ ఆస్తుల వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయని ఇంకా రు.10 లక్షలు కావాలని మరో నలుగురు కలిసి యాదగిరిని ఓ కారులో కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితుడు యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు భూక్యా సంతోష్ నాయక్ తో పాటు పాలకుర్తి రాకేష్ ను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. మరో ముగ్గురు నిందితులైన మాలోతు తిరుపతి, భూక్య గంగాధర్, బాలే జగన్ లు పరారీలో ఉన్నారని డిఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుండి 2 తులాల బంగారు గొలుసు, రూ.16 వేల నగదు, స్విఫ్ట్ డిజైర్ కారు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డి.ఎస్.పి తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని కేసు తదుపరి విచారణ కొనసాగుతుందని డిఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో టౌన్ సిఐ వేణుగోపాల్, ఎస్సై కిరణ్ ఉన్నారు.