ఒంగోలు : గత ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు వైసీపీ చేజారాయి. తాజాగా ఒంగోలులో వైసీపీకి మరో భారీ షాక్ తగలబోతోంది. 20 మంది వైసీపీ కార్పొరేటర్లతో పాటు ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులు జనసేనలో చేరబోతున్నారు. ఈ రోజు సాయంత్రం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో వీరంతా జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు.
వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరేందుకు కొన్ని రోజులుగా ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ… పవన్ అందుబాటులో లేకపోవడంతో ఈ కార్యక్రమం పలుమార్లు వాయిదా పడింది. బాలినేని వైసీపీలో ఉన్న సమయంలో వీరంతా ఆయన ఆశీస్సులతో కార్పొరేటర్లుగా గెలిచారు. బాలినేని వైసీపీని వీడి జనసేనలో చేరడంతో… వీరంతా కూడా ఆయన వెంటే నడుస్తామని చెప్పి, జనసేనలో చేరుతున్నారు. ఈ 23 మంది సభ్యులు కూడా జనసేనలో చేరితే మొత్తం ఒంగోలు రాజకీయమే మారిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.