- ఈ నెల 14 నుంచి పవన్ కల్యాణ్ వారాహి యాత్ర
- దైవ బలం కోసం హోమం నిర్వహించాలని నిర్ణయించిన జనసేనాని
- ఈ నెల 13న మంగళగిరి కార్యాలయంలో హోమం
ఏపీలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టాయి. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఈ నెల 14 నుంచి వారాహి యాత్రను చేపట్టబోతున్నారు. తన ప్రచార రథంతో రాష్ట్రమంతా చుట్టేయనున్నారు. అయితే, తన యాత్రకు దైవబలం కూడా తోడయ్యేందుకు హోమం నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 13న మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో హోమాన్ని నిర్వహించనున్నారు. హోమానికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఏర్పాట్లను పార్టీ నేతలు దగ్గరుండి చూసుకుంటున్నారు.
మరోవైపు వారాహి యాత్రకు సంబంధించి పోస్టర్ ను జనసేన సోమవారంనాడు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా నుంచి పవన్ యాత్ర ప్రారంభం కానుంది. అన్నవరం ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం పిఠాపురం, ప్రత్తిపాడు, కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుంది. అనంతరం పశ్చిమగోదావరి జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తుంది.