టోక్యో : జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు పని చేసే విధానాన్ని తీసుకు వస్తోంది. అన్ని సంస్థల్లో ఇది అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జపాన్ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.
వాస్తవానికి మూడేళ్ల క్రితమే జపాన్ ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఈ విధానం అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ మెజార్టీ సంస్థలు అంగీకరించలేదు. అప్పుడు కేవలం ఎనిమిది శాతం సంస్థలే దీనిని అమలు చేశాయి.
అయితే, మిగిలిన సంస్థలు కూడా ఇప్పుడు వారానికి నాలుగు రోజులు వర్కింగ్ డే పెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా చేయడం ద్వారా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం దక్కుతుందని పేర్కొంది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల్లో మరింత మందికి ఉద్యోగాలు కల్పించవచ్చునని తెలిపింది. ఇలా చేయడం వల్ల దేశంలో నిరుద్యోగాన్ని కొంతనైనా తగ్గించవచ్చునని పేర్కొంది.
అదే సమయంలో వారానికి నాలుగు రోజులు పనిదినాలు ఉంటే కుటుంబంతో ఎక్కువ సమయం గడిపి, పిల్లల పెంపకంపై దృష్టి సారించేందుకు వీలవుతుందని తెలిపింది.