సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్-5ను ప్రస్తావిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు.
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కనీసం పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని సెక్షన్-5 చెబుతోందని వెల్లడించారు. కానీ ఏపీ ఇంతవరకు రాజధానిని ఏర్పాటు చేసుకోనందున, మరో పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని కోరారు. ఆ మేరకు భారత రాష్ట్రపతి ప్రత్యేకమైన ఆర్డినెన్స్ జారీ చేయాలని వీవీ లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం రాగా… ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి వచ్చేసి ఏపీలో అమరావతి రాజధానిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలపడంతో అమరావతి రాజధాని అంశం అగమ్యగోచరంగా మారింది.