బెంగళూరు : కర్ణాటక శాసన సభ ఎన్నికల కోసం జేడీఎస్ భారీ తాయిలాలు ప్రకటిస్తోంది. ఇప్పటి వరకు ముస్లింలు, వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక పథకాల ద్వారా ప్రయోజనం చేకూర్చుతామని హామీలను ఇవ్వడం చూశాం..ఇప్పుడు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి రైతుల కోసం ఓ తాయిలాన్ని ప్రకటించారు. వ్యవసాయదారుల కుటుంబంలోని అబ్బాయిలను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు రూ.2 లక్షలు అందిస్తామని చెప్పారు. కోలార్‌లోని పంచరత్న ర్యాలీలో కుమార స్వామి మాట్లాడుతూ, వ్యవసాయదారుల కుటుంబంలోని అబ్బాయిలను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు రూ.2 లక్షలు అందిస్తామని చెప్పారు. రైతుల పిల్లలకు పెళ్లిళ్లు జరిగేలా ప్రోత్సహించడం కోసం వధువులకు రూ.2 లక్షలు చొప్పున ప్రభుత్వం ఇవ్వాలన్నారు. రైతుల పిల్లలను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడటం లేదని తనకు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, రైతు బిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడటం కోసం ఈ పథకాన్ని అమలు చేస్తానని చెప్పారు..
