సంగారెడ్డి, జిన్నారం: గ్రామాల మధ్య మెరుగైన రవాణా సౌకర్యం కోసం కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండల పరిధిలోని అండూరు, వావిలాల జంగంపేట గ్రామాల పరిధిలో 76 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న కల్వర్టుల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం లక్ష్మీపతి గూడెంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం గత పది సంవత్సరాలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దామని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పూర్తి పారదర్శకతతో నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, తాజా మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.