హైదరాబాద్ అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులకు జో బైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విదేశీ నిపుణులను మరింత సులభంగా నియమించుకునే అవకాశాన్ని అక్కడి కంపెనీలకు కల్పిస్తూ నిబంధనల్లో మార్పులు చేసింది. అలాగే, ఎఫ్-1 స్టూడెంట్ వీసాలను హెచ్-1బీ వీసాలుగా మార్చుకునే అవకాశం కల్పించింది. ఫలితంగా లక్షలాదిమంది భారతీయ ప్రొఫెషనల్స్‌కు ప్రయోజనం చేకూరనుంది.
అమెరికాలోని ఐటీ కంపెనీలు హెచ్-1బీ వీసా (నాన్ ఇమిగ్రెంట్) సాయంతో విదేశీ నిపుణులను నియమించుకుంటాయి. ఈ వీసా ద్వారా భారత్, చైనా దేశాలు భారీగా లబ్ధి పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ నిబంధనల్లో మార్పులు చేసి అవసరాలకు తగ్గట్టుగా విదేశీ ఉద్యోగులను నియమించుకునే అవకాశాన్ని అక్కడి కంపెనీలకు కల్పించింది.
ఈ కొత్త విధానంలో లేబర్ కండిషన్ అప్లికేషన్ కచ్చితంగా హెచ్-1బీ వీసా పిటిషన్‌కు అనుగుణంగా ఉండాలి. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. తాజా మార్పులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నియమించుకునే అవకాశం యజమానులకు లభిస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెంజాడ్రో ఎన్ మేయోర్కాస్ తెలిపారు.