తమ సార్వభౌమత్వాన్ని ఎవరూ అడ్డుకున్నా.. వారికి బలంగా సమాధానం ఇస్తామని బైడెన్ అన్నారు. అమెరికా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆయన చైనాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ తమ సార్వభౌమత్వానికి చైనా నుంచి ప్రమాదం పొంచి ఉంటే, అప్పుడు దేశాన్ని రక్షించుకునేందుకు సరైన రీతిలో స్పందిస్తామని అన్నారు. దానికి తగినట్లే వ్యవహరిచామని కూడా ఆయన తెలిపారు. గత శనివారం చైనా నిఘా బెలూన్‌ను పేల్చివేసిన విషయాన్ని ఆయన తన ప్రసంగంలో పరోక్షంగా వెల్లడించారు.
ఒక విషయంలో అందరూ స్పష్టంగా ఉండాలని, చైనాతో జరుగుతున్న వ్యాపార పోరాటంలో గెలుపు అనేది అందర్నీ కలపాలని, ప్రపంచవ్యాప్తంగా తమ దేశానికి ఎన్నో సవాళ్లు ఉన్నాయని, గత రెండేళ్లలో ప్రజాస్వామ్యాలు బలపడ్డాయని, కానీ బలహీనపడలేదని బైడెన్ తెలిపారు. అమెరికా ప్రయోజనాల కోసం చైనాతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామన్నారు.
స్టేట్ ఆఫ్ ద యూనియన్‌లో బైడెన్ ప్రసంగించడం ఇది రెండోసారి. ఈసారి ఆయన ఉభయసభలను ఉద్దేశించి గంటా 15 నిమిషాలు మాట్లాడారు. బైడెన్ ప్రసంగాన్ని రిపబ్లికన్లు పదేపదే అడ్డుకునే ప్రయత్నం చేశారు.